ప్రభాస్ తర్వాత ఆ క్రెడిట్ బన్నీదే!

మాములుగా చిన్న సినిమాలే ముందు రోజు ప్రీమియర్లకు భయపడుతున్న రోజులివి. టాక్ బాగా వస్తే సోషల్ మీడియా సహాయంతో అదే పెద్ద మార్కెటింగ్ టూల్ గా మారుతోంది. ఏ మాత్రం కొంచెం అటుఇటు అయినా అసలు రిలీజ్ రోజు ఉదయం ఆటకే జనం పల్చబడిపోతున్నారు. ఇది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. కానీ ఇవన్నీ మీడియం రేంజ్ చిత్రాలకే పరిమితమైన ఫీట్లు. టయర్ 1 హీరోలు ఎప్పుడూ ఇలాంటి రిస్కులు చేయలేదు. దర్శక నిర్మాతలు కూడా ఆలోచించలేదు. ఒక్క బాహుబలి 2కి మాత్రమే ముందు రోజు రాత్రి స్పెషల్ ప్రీమియర్ వేశారు. ఆ తర్వాత ఎవరికీ జరగలేదు.

ఇన్ని సంవత్సరాల తర్వాత పుష్ప 2 ది రూల్ కు డిసెంబర్ 4 రాత్రే షోలు వేసేందుకు సిద్ధపడటం చూస్తే ఎంత పెద్ద రిస్కో అర్థమవుతుంది. ఎందుకంటే పాజిటివ్ అయినా నెగటివ్ అయినా టాక్ దావానలంగా పాకిపోతుంది. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా బన్నీ గురించి ప్రతికూల ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్న వర్గాలు లేకపోలేదు. యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇదేమీ పని చేయదు కానీ ఫ్యాన్స్ అత్యుత్సాహం, థియేటర్ వీడియోలు తీసి ఎక్స్ లో పెట్టడం, కథలో కీలక ట్విస్టులు బయటికి చెప్పేయడం ఇవన్నీ బాగా ఇబ్బంది పెట్టే విషయాలు. వీటిని కట్టడి చేయడం మైత్రి బృందానికి పెద్ద సవాల్.

సో పుష్ప 2 చేస్తున్న సాహసం మామూలుది కాదు. పైగా గత కొన్నేళ్లలో ఎవరి సినిమా ప్రీమియర్ అయినా సరే అధికారిక టికెట్ ధర వెయ్యి రూపాయలు దాటిన దాఖలాలు లేవు. కానీ పుష్పరాజ్ మాత్రం ఏకంగా 1200 రూపాయల దాకా తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి తెలంగాణ వరకే ఈ హైక్ ప్రకటించినా ఏపీలోనూ కొంచెం అటుఇటు పెద్ద రేట్లే ఉండబోతున్నాయి. బాహుబలి 2కి ప్రభాస్, రాజమౌళి తీసుకున్న రిస్క్ బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇచ్చింది. కానీ అంతకన్నా పెద్ద స్కేల్ లో అల్లు అర్జున్, సుకుమార్ చేయబోతున్న ఫీట్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. సానుకూలమైతే మాత్రం రికార్డులకు ఆకాశమే హద్దు.