పుష్ప : ఎక్కడ చూసినా మీకు నచ్చిన భాషలో వినొచ్చు!

అల్లు అర్జున్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని న‌టించిన పుష్ప-2 `దిరూల‌ర్‌` క్యాప్ష‌న్‌తో డిసెంబ‌రు 5న ప్ర‌పంచ వ్యాప్తంగావిడుద‌ల కానున్న సినిమాకు మ‌రింత హైప్ తీసుకువ‌చ్చారు నిర్మాత‌లు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యం నుంచే పెద్ద ఎత్తున టాక్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కొన్ని నెలల కింద‌ట అల్లు అర్జున బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌ల చేసి ఆరు సెక‌న్ల షార్ట్ టీజ‌ర్‌.. అప్పట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఇక‌, ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫుల్ లెంగ్ద్ టీజ‌ర్ మ‌రింత‌గా సినిమాపై అంచ‌నాలు పెంచింది.

ఇక‌, శ్రీల‌ల‌తో చేసిన ఐటం సాంగ్ `కిసిక్‌` పాట కూడా నెమ్మ‌ది నెమ్మ‌దిగా మాస్‌లోకి వెళ్తోంది. ఇక‌, ఈ సిని మా ప్ర‌మోష‌న్ ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. బిహార్ రాజ‌ధాని ప‌ట్నాలో కొన్ని రోజుల కింద‌ట ప్రారంభించిన ఈ ప్ర‌మోష‌న్‌.. త‌మిళ‌నాడు స‌హా ఇత‌ర రాష్ట్రాల్లోనూ అభిమానుల మ‌న‌సు దోచుకుంటోంది. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించిన టికెట్ల విక్ర‌యాలు అయిపోయాయ‌ని కూడా ఒక టాక్‌.ఈ నేప‌థ్యంలో ఎవ‌రు ఎక్క‌డ ఈ సినిమా చూసినా ప్రేక్ష‌కుల‌కు ఇబ్బంది లేకుండా.. ఓ యాప్‌ను తీసుకువ‌చ్చారు.

ఈ విష‌యాన్ని పుష్ప‌-2 ప్ర‌మోష‌న్‌లో భాగంగా మైత్రి మూవీ మేక‌ర్స్ అధినేత ర‌విశంక‌ర్ చెప్పుకొచ్చారు. ప్ర‌పంచ వ్యాప్తంగా 12000 స్క్రీన్స్‌పై పుష్ప 2ను రిలీజ్ చేస్తున్న‌ట్టు చెప్పారు. భాషా సౌల‌భ్యం కోసం.. `సినీ డ‌బ్స్‌` అనే యాప్‌ను తీసుకువ‌చ్చామ‌న్నారు. ఈ యాప్‌ద్వారా ఎంపిక చేసి ఆరు భాష‌ల్లో ఏ భాష‌ను ప్రేక్ష‌కులు ఇష్ట‌ప‌డితే దానిలోనే ఈ సినిమాను వీక్షించ‌వ‌చ్చ‌ని చెప్పారు. త‌ద్వారా భాషా ప‌ర‌మైన ఇబ్బందులు కూడా లేకుండా.. సినిమాను ఆస్వాదించే అవ‌కాశం క‌ల్పించామ‌న్నారు. సో.. మొత్తానికి ఇప్ప‌టికే.. అన్ని హంగుల ప‌రంగా ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేస్తున్న పుష్ప‌-2 ఇప్పుడు మ‌రింత‌గా మ‌న‌సులు దోచుకోనుంది.