ఇది పురుషాధిక్య సమాజం. నిజ జీవితంలోనే కాదు సినిమాల్లోనూ అదే కనిపిస్తుంది. అందుకే మార్కెట్, బిజినెస్ లెక్కలు హీరో మీద ఆధారపడి చేస్తారు తప్పించి హీరోయిన్ మీద కాదు. విజయశాంతి, అనుష్క, సమంత లాంటి అతికొందరు మాత్రమే ఈ పోకడకు ఎదురీది విజయాలు సాధించారు. ఇలాంటి పోకడలో స్టార్లు తమ ఆలోచనా ధోరణిని మార్చుకుని దర్శకులకు తగ్గట్టు, సన్నివేశం లేదా పాట డిమాండ్ చేసినట్టు రాజీపడేందుకు సిద్ధపడుతున్నారు. దానికి రెండు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఒకటి పుష్ప 2 ది రూల్ కాగా రెండోది గేమ్ ఛేంజర్. వీటి మధ్య సారూప్యతలే ఈ టాపిక్ కు కారణం.
ముందు పుష్ప 2 చూస్తే ట్రైలర్ లో చూపించిన ఒక షాట్లో రష్మిక మందన్న పాదాలను తమ చెంపల మీద రాసుకుంటున్న అల్లు అర్జున్ ని చూడొచ్చు. తన భార్యని ఎంతగా ప్రేమిస్తున్నాడో సింబాలిక్ గా చెప్పేందుకు దర్శకుడు సుకుమార్ చేసిన ప్రయత్నమిది. ప్రపంచాన్ని వణికించే మగాడు కట్టుకున్న దాని కోసం ఎంతకైనా దిగుతాడనే దానికి నిదర్శనంగా పెట్టాడు. ఇక గేమ్ ఛేంజర్ నుంచి తాజాగా రిలీజైన నానా హైరానా పాటలో ఒక చోట కియారా అద్వానీ పాదాన్ని రామ్ చరణ్ తన బుగ్గవైపు తీసుకోవడం గమనించవచ్చు. కొరియోగ్రఫీ ప్రకారమే అనుకున్నప్పటికీ చరణ్ వద్దనుకుంటే మార్చే అవకాశమున్న బిట్ ఇది.
గతంలోనూ ఇలాంటివి వచ్చాయి కానీ పెద్ద హీరోల మీద చూపించినవి తక్కువ. అప్పుడెప్పుడో ఘరానా మొగుడులో నగ్మా చిరంజీవిని కొట్టే సీన్ ఉందని ఫ్యాన్స్ నానా గొడవ చేశారు.నరసింహలో రమ్యకృష్ణ సౌందర్య చెంపను కాలితో నిమరడం మీద కూడా చర్చ జరిగింది. 1 నేనొక్కడినేలో కృతి సనన్ మహేష్ బాబుల మధ్య ఇలాంటి కెమిస్ట్రీ గురించి సామ్ చేసిన కామెంట్స్ చిన్నపాటి దుమారం రేపాయి. ఇప్పుడు బన్నీ, చరణ్ లు చేసినవి చూస్తే ఆహ్వానించదగ్గ ఇలాంటి ట్రెండ్ ఇకపై కూడా కొనసాగాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈగోలు, క్యాలికులేషన్లు లేకుండా దర్శకులు స్వేచ్ఛగా తాము అనుకున్నవి తెరకెక్కిస్తారు.