ఈ నెల 15న దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. ఐతే థియేటర్లు తెరుస్తాం కానీ.. ఆడించడానికి సినిమాలేవీ అంటున్నారు ఎగ్జిబిటర్లు. పాత సినిమాలు విడుదల చేసినా ఫలితం ఉండదు. కొత్తవి చూస్తే పేరున్నవి ఏవీ రిలీజయ్యేలా కనిపించడం లేదు.
హౌస్ ఫుల్ అయినా సరే.. సగం రెవెన్యూ వచ్చే పరిస్థితుల్లో ఎవరు ధైర్యం చేసి తమ సినిమాను రిలీజ్ చేస్తారు..? చేజేతులా చంపుకుంటారు..? ఈ నేపథ్యంలో థియేటర్లు తెరుస్తున్నారంటే తెరుస్తున్నారు అన్నట్లే ఉంది పరిస్థిితి. ఇండియాలో ఏ ఇండస్ట్రీలో కూడా కొత్త సినిమాల విడుదలకు నిర్మాతలు సుముఖంగా కనిపించట్లేదు. మరి థియేటర్ల పున:ప్రారంభం కోసం గట్టిగా డిమాండ్ చేసిన మల్టీప్లెక్స్ ఛైన్స్ ఏం చేస్తాయన్నది ప్రశ్నార్థకంగా మారింది.
భారతీయ సినిమాల మీద పెద్దగా ఆశ లేదు కానీ.. హాలీవుడ్ సినిమాలను ప్రదర్శించడం గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నది క్రిస్టోఫర్ నోలన్ సినిమా ‘టెనెట్’. ఈ చిత్రం రెండు నెలల కిందటే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమా బాగుందని టాక్ వచ్చినా కరోనా పరిస్థితుల వల్లే దాని వసూళ్లు దెబ్బ తిన్నాయి.
ఇండియాలో ఈ సినిమాకు మంచి ఆదరణే దక్కుతుందని ఆశతో ఉన్నారు. కాకపోతే రెవెన్యూ షేర్ విషయంలో చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ పెడుతున్న షరతుల వల్ల పీఠముడి పడ్డట్లు సమాచారం. మామూలుగా హాలీవుడ్ సినిమాలను 50-50 రెవెన్యూ పంచుకునేలా నిర్మాణ సంస్థలు ఇతర దేశాల్లో విడుదల చేస్తాయి.
ఐతే ‘టెనెట్’ మీద భారీ పెట్టుబడి పెట్టడం, సినిమాల ప్రదర్శనకు అంతగా అనుకూలంగా లేని పరిస్థితుల్లో రిస్క్ చేసి రిలీజ్ చేస్తున్నందుకు వార్నర్ బ్రదర్స్ తమకు 65 శాతం షేర్ కోరుతోంది. వివిధ దేశాల్లో అలాగే రిలీజ్ చేసింది. ఐతే 50 శాతం ఆక్యుపెన్సీతో రిలీజ్ చేస్తూ, శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ లాంటి వాటికి ఖర్చు పెడుతూ.. నిర్మాణ సంస్థకు 65 శాతం, ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్ల షేర్ ఇచ్చి తమకు మిగిలేదముంటుంది అంటున్నాయి మల్టీప్లెక్స్‌ల యాజమాన్యాలు. దీనిపై చర్చలు ఎంతకీ తెగట్లేదట. దీనికి తోడు ఢిల్లీ, మహారాష్ట్రల్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితులు కూడా లేకపోవడంతో 15న ‘టెనెట్’ ఇండియాలో రిలీజ్ కావడం సందేహమే అంటున్నారు.