ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్ కు సంబంధించిన ప్రధాన ఘట్టం పూర్తయ్యింది. ముందే లీకైనట్టు 3 గంటల 20 నిమిషాల ఫైనల్ కట్ తో పుష్ప రాజ్ థియేటర్లలో చేయబోయే మాస్ రాంపేజ్ ఏ స్థాయిలో ఉంటుందో వర్ణించడం కష్టమే. ఊహించినట్టే యు/ఏ సర్టిఫికెట్ అందుకోగా కొన్ని మ్యూట్లు, కట్లతో కలిపి ఫైనల్ వెర్షన్ రచ్చ చేయడం ఖాయమనే రేంజ్ లో ఉందట. సెన్సార్ అధికారుల నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఊర మాస్ కంటెంట్ తో ప్రేక్షకులు ఉర్రూతలూగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక కంటెంట్ విషయానికి వస్తే అంచనాలకు మించి పుష్ప 2ని దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా విపరీతమైన హైప్ తెచ్చుకున్న జాతర ఎపిసోడ్ ఇప్పటిదాకా ఏ స్టార్ హీరోకి పడని రేంజ్ లో వచ్చిందట. గంగమ్మకు మొక్కు తీర్చి శత్రువులను చితక్కొట్టే సన్నివేశం ఇరవై నిమిషాలకు పైగా గూస్ బంప్స్ ఇస్తుందని అంటున్నారు. ఫహద్ ఫాసిల్ ఎంట్రీ కొంచెం ఆలస్యంగా ఉన్నప్పటికీ ఎక్కడా ఎలివేషన్లు తగ్గకుండా, పావు గంటకోసారి క్రమం తప్పకుండా హై ఇచ్చే సన్నివేశాలను సుకుమార్ రాసుకున్న తీరు గురించి ప్రత్యేక ప్రశంసలు వినిపిస్తున్నాయి.
ఇక శ్రీవల్లి ట్రాక్ సైతం లవ్లీగా ఎమోషనల్ గా వచ్చిందని వినికిడి. పాటలు, పుష్పతో ఆమె బాండింగ్ చాలా స్పెషల్ గా ఉంటాయని అంటున్నారు. జపాన్ ఎపిసోడ్, ఇంద్ర ఆడుతున్న థియేటర్ ఫైట్, క్లైమాక్స్ లో పోర్ట్ వేదికగా జరిగే హోరాహోరీ యుద్ధం ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయని ఊరిస్తున్నారు. శ్రీలీల కిస్సిక్ పాటకు సీట్లలో కూర్చోవడం కష్టమేనట. మొత్తానికి కెజిఎఫ్ 2, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎసరు పెట్టే కంటెంట్ అయితే పుష్ప 2 ది రూల్ లో ఉన్న క్లారిటీ వచ్చేసింది. నిజంగా ఆ స్థాయిలో ఉంటే కనీసం రెండు వారాల పాటు టికెట్లు దొరకడం కష్టమే. ఇండస్ట్రీకి కావాల్సింది అదే.