పుష్ప 2 ది రూల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాధ్యతని తనకు కాకుండా వేరొకరికి ఇవ్వడం పట్ల దేవిశ్రీ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చాలా దూరం వెళ్లి ఇవాళ రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ లో నిర్మాత రవిశంకర్ అలాంటిదేమి లేదని చెప్పే దాకా ఆగింది. ఇక్కడితో స్టోరీ అయిపోయినట్టేనని అందరూ భావించారు. కానీ దీనికీ సీక్వెల్ ఉందండోయ్. మైత్రి మూవీ మేకర్స్ తమిళంలో నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీకి సంగీతం దేవినే అన్న సంగతి తెలిసిందే. మార్క్ ఆంటోనీ ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రైమ్ కామెడీ డ్రామాను 2025 సంక్రాంతి బరిలో దింపాలనే దిశగా విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ దశలో గుడ్ బ్యాడ్ అగ్లీకి దేవి నేపధ్య సంగీతం అందించడం లేదని తన స్థానంలో జివి ప్రకాష్ కుమార్ కు ఆ బాధ్యతలు ఇచ్చారనే ప్రచారం మూడు రోజుల క్రితం మొదలయ్యింది. అయితే అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోవడం దేవిశ్రీ ప్రసాద్ అభిమానులు ఎదురు చూస్తూ వచ్చారు. తాజాగా జివి ప్రకాష్ ఎక్స్ హ్యాండిల్ లో ఒక అభిమాని తన ఫోటోకు పెట్టిన కామెంట్ కు స్పందిస్తూ గుడ్ బ్యాడ్ అగ్లీకి బిజిఎం తనే ఇస్తున్నట్టు అర్థం వచ్చేలా రెండు ఫైర్ ఎమోజిస్ ని పెట్టడంతో ఒక్కసారిగా మబ్బులు వీడిపోయాయి. సో మైత్రి సంస్థలో దేవిశ్రీ ప్రసాద్ కు రెండో సినిమా చేజారినట్టే.
పుష్ప 2కి సమయం లేదు కాబట్టి అదే ప్రధాన కారణం అనుకోవచ్చు. కానీ అజిత్ సినిమాకు అంత సమస్య లేదు. ఇంకా టైం ఉంది. అనిరుధ్, తమన్ లాగా దేవిశ్రీ ప్రసాద్ ఒకేసారి నాలుగైదు ప్రాజెక్టుల మీద డెడ్ లైన్ పెట్టుకుని పనిచేయడం లేదు. అలాంటప్పుడు గుడ్ బ్యాడ్ ఆగ్లీకి పని చేయొచ్చు. మరి ఎందుకు తప్పుకున్నాడనేది అంతుచిక్కని రహస్యం. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఇకపై కూడా కలిసి పని చేస్తామని మైత్రి అధినేతలు క్లారిటీ ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఇప్పుడీ ట్విస్టు చోటు చేసుకోవడం గమనార్షం. మంకతా (గ్యాంబ్లర్) ని మించే స్థాయిలో గుడ్ బ్యాడ్ అగ్లీ మీద ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.