జనవరి 10 విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్లలో కీలకమైనది ప్రీ రిలీజ్ ఈవెంట్. దానికి సంబంధించి నిర్మాత దిల్ రాజు పెద్ద ఎత్తున ప్లానింగ్ చేయబోతున్నట్టు సమాచారం. జనవరి 4 రాజమండ్రి వేదికగా చేయబోయే వేడుకకు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ని తీసుకురాబోతున్నట్టు తెలిసింది. ఆయన ఒప్పుకున్నారా లేదానేది ఇంకా ఖరారుగా తెలియాల్సి ఉంది కానీ టీమ్ తరఫున అబ్బాయ్ పెట్టిన విన్నపానికి బాబాయ్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్టుగా వినికిడి. ఉపముఖ్యమంత్రి అయ్యాక పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉండటం వల్ల పవన్ ఏ టాలీవుడ్ కార్యక్రమానికి హాజరు కాలేదు.
ఒకే స్టేజిని పవన్ చరణ్ పంచుకోవడం గురించి కొద్దిరోజుల క్రితమే టాక్ వచ్చినప్పటికీ ప్రస్తుతం దాన్ని నిజం చేసే దిశగా చర్యలు మొదలైనట్టు తెలిసింది. గేమ్ ఛేంజర్ ఎలాగూ సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ మూవీ. రాజకీయాల విలువలతో పాటు ఎన్నికల వ్యవస్థ ఎలా నడవాలనే దాని మీద రామ్ చరణ్ రెండు పాత్రలు పోషించాడు. ఒకటి అప్పన్న రెండోది రామ్ నందన్ ఐఏఎస్. ఏదో రెగ్యులర్ మాస్ సినిమా అయితే పవన్ కు చెప్పేందుకు పెద్దగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు సబ్జెక్టు అలాంటిది కాబట్టి బోలెడు విషయాలు పంచుకోవచ్చు. మెగా ఫాన్స్ కి ఇంత కన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది.
ఈ కలయిక అనగానే ఫ్యాన్స్ కి ముందు గుర్తొచ్చేది రంగస్థలం సక్సెస్ మీట్. అప్పట్లో పవన్, చరణ్ ల బాండింగ్ ని చూసిన వాళ్ళు ఆ వీడియోలను మర్చిపోలేదు. వీడు నా కొడుకు కాదు తమ్ముడు అంటూ పవన్ ఆప్యాయంగా చరణ్ ని ముద్దుపెట్టుకున్న తీరు అలా మనసులో ముద్రించుకుపోయింది. మళ్ళీ జరిగితే మాత్రం గేమ్ ఛేంజర్ కు పెద్ద బూస్ట్ అవుతుంది. మూడేళ్ళగా నిర్మాణంలో ఉండటం వల్ల బజ్ తక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్న ప్రమోషన్లు హైప్ ని అమాంతం పెంచుతున్నాయి. జనవరి 4 దీన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడం ఖాయం. ఫ్యాన్స్ కోరుకుంటోంది ఇదే.