ఇటీవలే చెన్నైలో జరిగిన పుష్ప 2 ది రూల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగం ఎంత దుమారం రేపిందో చూశాం. దేవి నేరుగా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ ని ఉద్దేశించి నా మీద ప్రేమకన్నా ఈ మధ్య కంప్లయింట్స్ ఎక్కువయ్యాయని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు క్రెడిట్స్, రెమ్యునరేషన్ ఏదైనా సరే అడిగి తీసుకోవాల్సిందేనని అడుగుతూ బన్నీకి కూడా కోట్ చేయడం చర్చకు దారి తీసింది. ఇవాళ జరిగిన రాబిన్ హుడ్ ప్రెస్ మీట్ లో మీడియాతో కలిసే అవకాశం మైత్రి మేకర్స్ కు దక్కిన నేపథ్యంలో ఈ వివాదానికి సంబంధించిన ప్రశ్న ఎదురయ్యింది. దానికి రవినే సమాధానం చెప్పారు.
దేవిశ్రీ ప్రసాద్ అన్నదాంట్లో మాకేం తప్పు కనిపించలేదని, ప్రేమతో పాటు ఫిర్యాదులున్నాయని అన్నారు తప్పించి అక్కడ వేరే ఉద్దేశం లేదని, మీడియాలో రకరకాలుగా విశ్లేషించి కథనాలు రాసిందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో మేమున్నంత వరకు దేవితో పని చేస్తూనే ఉంటామని కుండ బద్దలు కొట్టేశారు. నిజానికీ ఈ కాంబోలో నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్, రామ్ చరణ్ 17 ఉన్నాయి. కానీ మొన్న జరిగిన కాంట్రావర్సీ వల్ల డిఎస్పి ఈ ఛాన్సులు పోగొట్టుకుంటాడేమోననే ప్రచారం జరిగింది. కానీ అదేమీ లేదని స్వయంగా రవి స్పష్టత ఇచ్చారు కాబట్టి కలయిక రిపీట్ అవుతుందనుకోవచ్చు.
ఏదైతేనేం మొత్తానికి వివాదానికి శుభం కార్డు పడినట్టే అనుకోవాలి. ఇంకా ఈవెంట్లున్నాయి. హైదరాబాద్ లో ఒక వేడుక ప్లాన్ చేశారు. బెంగళూరులో ఒకటి జరగాల్సి ఉంది. రిలీజయ్యాక సక్సెస్ మీట్ చేయాలి. తిరిగి ఎక్కడో ఒక చోట దేవిశ్రీ ప్రసాద్ మరోసారి దీని గురించి మాట్లాడి వేడి చల్లార్చే ప్రయత్నం చేయకపోడు. సో సినిమా తరహాలో ఈవెంట్ల మీద అంచనాలు రేగడం పుష్ప 2 విషయంలోనే జరిగిందని చెప్పాలి. మూడు గంటల ఇరవై నిమిషాల నిడివితో పుష్ప రాజ్ అరాచకం ఉంటుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ రోజు రోజుకి బంగారం ధరలా ఎగబాకుతోంది.