సుకుమార్, దేవి… కలిసి పని చేయగలరా?

చెన్నైలో జరిగిన ‘పుష్ప-2’ తమిళ ప్రి రిలీజ్ ఈవెంట్లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రసంగంతో రాజుకున్న వివాదం సోషల్ మీడియాను ముంచెత్తింది. నిన్న రాత్రి నుంచి తెలుగు సినిమా ప్రియుల్లో, అలాగే టాలీవుడ్లో దీని గురించి పెద్ద చర్చే జరుగుతోంది. చాలా రోజుల నుంచి దాచుకున్న బాధను దేవి ఈ వేడుకలో వెళ్లగక్కేశాడు. ఒక దశలో దేవి గద్గద స్వరాన్ని వింటే అతనెంత ఎమోషనల్ అయ్యాడనే విషయం అర్థమవుతుంది. స్టేజ్ మీద ఎప్పుడూ చలాకీగా మాట్లాడే దేవి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం షాకింగే. ‘పుష్ప-2’ నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలను టార్గెట్ చేసుకుని అతను మాట్లాడాడు కానీ.. తన అసంతృప్తి, కోపం ప్రధానంగా దర్శకుడు సుకుమార్ మీద అనే చర్చ జరుగుతోందిప్పుడు.

దేవి చాలామంది దర్శకులతో వరుసగా సినిమాలు చేశాడు. కానీ త్రివిక్రమ్, కొరటాల శివ సహా పలువురు దర్శకులు మధ్యలో అతణ్ని వదిలేసి వేరే మ్యూజిక్ డైరెక్టర్లతో వెళ్లిపోయారు.కానీ ఒక్క సుకుమార్ మాత్రమే మొదట్నుంచి ఇప్పటిదాకా తనతో కొనసాగుతూనే ఉన్నాడు. ఛాయాగ్రాహకులు, ఇతర టెక్నీషియన్లను మారుస్తూ వచ్చాడు తప్ప.. సంగీత దర్శకుడిగా మాత్రం దేవినే ఫిక్స్. ఇద్దరి మధ్య సినిమాను మించి వ్యక్తిగతంగానూ బంధం ఏర్పడింది. సుకుమార్‌తో సరైన సింక్‌లో పని చేయడం దేవికే సాధ్యం అనే అభిప్రాయం బలంగా ఏర్పడిపోయింది. గత కొన్నేళ్లలో దేవి సంగీతంలో ప్రమాణాలు పడిపోయిన మాట వాస్తవం. కొన్ని సినిమాలకు తన స్థాయికి తగ్గ సంగీతం ఇవ్వలేకపోయాడు. కానీ సుకుమార్ మాత్రం అతణ్ని కష్టపెట్టి, విసిగించి తన సినిమాలకు మాత్రం బెస్ట్ ఔట్ పుట్ తీసుకుంటూనే వచ్చాడు.

ఈ క్రమంలోనే ‘పుష్ప-2’ పాటలు మార్మోగిపోయాయి. ఆ చిత్రానికి తనకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం కూడా దక్కింది. ఇంతటి సక్సెస్ తర్వాత ‘పుష్ప-2’ మ్యూజిక్ విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడం అనూహ్యం. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు అంచనాలను అందుకోలేకపోయాయన్నది వాస్తవం. ఈ క్రమంలోనే బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలోనూ సంతృప్తి చెందక సుకుమార్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ల వైపు చూశాడు. ఇది దేవికి నచ్చలేదు. ఈ విషయంలో సుకుమార్ ఆలోచన కరెక్టే అనిపించొచ్చు.

కానీ ఒకసారి తాను ఇచ్చిన ఔట్ పుట్ నచ్చకపోతే మళ్లీ మళ్లీ పని చేయించుకుని అయినా బెస్ట్ ఔట్ తీసుకోవడం అలవాటైన సుకుమార్.. ఇప్పుడిలా ఎందుకు చేశాడన్నది అతడి వాదన కావచ్చు. పైగా షూట్ చాలా ఆలస్యం చేసి ఆఖరి నిమిషంలో హడావుడి పెట్టి ఔట్ పుట్ బాలేదంటే తన తప్పా అనే ప్రశ్నలు కూడా అతను సంధిస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం వేరే మ్యూజిక్ డైరెక్టర్లను ఆశ్రయించడం.. అలాగే తాను లేట్ చేస్తానని, సరైన ఔట్ పుట్ ఇవ్వనని నిందలు వేయడం దేవికి తీవ్ర ఆవేదన కలిగించినట్లు కనిపిస్తోంది. సుక్కుతో తన అనుబంధాన్ని కూడా పక్కన పెట్టి స్టేజ్ మీద ఇలా మాట్లాడ్డం ఆశ్చర్యకరమే. ఇంత జరిగాక సుక్కు, దేవి తర్వాతి సినిమాకు కలిసి పని చేస్తారా అన్నది సందేహమే.