‘పుష్ప-2’ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్ జరిగినపుడల్లా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. కొన్ని రోజుల కిందట బీహార్‌లోని పాట్నాలో చేసిన భారీ ఈవెంట్ గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకున్నారు. అక్కడినుంచి సౌత్‌కు ప్రమోషన్లను షిఫ్ట్ చేసిన టీం నిన్న చెన్నైలో ఇంకో పెద్ద ఈవెంట్ చేసింది. ఈ ఈవెంట్ కూడా బాగా చేశారు. సక్సెస్ అయింది కానీ.. ఇక్కడ హీరో అల్లు అర్జున్‌ను మించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హైలైట్ అయిపోయాడు. అతడి మాటల చుట్టూ ముసురుకున్న వివాదం వార్తల్లో ఎక్కువ నానింది. స్టేజ్ మీద చాలా సరదాగా కనిపించే దేవి.. ఇంత వివాదాస్పదంగా, ఎమోషనల్‌గా మాట్లాడ్డం ఇంతకుముందు ఎన్నడూ చూసి ఉండదు.
‘పుష్ప-2’ సంగీతం విషయంలో తనను అకారణంగా నిందించడం.. తనుండగా వేరే ముగ్గురు సంగీత దర్శకులను ఇందులో భాగస్వాముల్ని చేసి బ్యాగ్రౌండ్ స్కోర్ చేయించుకోవడం అతడిని బాగానే హర్ట్ చేసినట్లుంది.ఐతే దేవి బాధ అర్థం చేసుకోదగ్గదే కానీ.. అతను నిర్మాతలను నిందించడం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ జరుగుతోంది. ‘పుష్ప-2’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో నిర్మాతలు మొదట్నుంచి పడుతున్న బాధ అంతా ఇంతా కాదు. షూటింగ్ విపరీతంగా ఆలస్యం అయింది. బడ్జెట్ తడిసి మోపెడైంది. సినిమా ఆగస్టు 15 నుంచి వాయిదా పడ్డపుడు.. ఆ తర్వాత సుకుమార్, బన్నీ మధ్య చిన్న గ్యాప్ వచ్చి షూటింగ్‌కు బ్రేక్ పడినపుడు నిర్మాతలు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసు. అప్పుడు ప్రధాన సమస్య సుకుమార్, బన్నీల మధ్య కాగా.. వాళ్లిద్దరూ నిర్మాతల మీదే పడ్డట్లు యూనిట్ వర్గాల సమాచారం. ఆ పరిస్థితిని అధిగమించి మళ్లీ షూట్ సజావుగా సాగేలా చూడ్డానికి నిర్మాతలు కిందా మీదా పడ్డారు.
ఇక దేవి గొడవ విషయానికి వస్తే.. అతడి పనితనం నచ్చక వేరే సంగీత దర్శకులను ప్రాజెక్టులోకి తీసుకువచ్చింది ప్రధానంగా సుకుమారే. ఇందులో కొంత బన్నీ ప్రమేయం కూడా ఉందనే అనుమానాలున్నాయి. నిర్మాతలకు ఈ గొడవతో అసలు సంబంధం లేదు. కానీ దేవి మాత్రం తప్పంతా నిర్మాతలదే అన్నట్లు వాళ్ల మీద పడిపోయాడు. సుకుమార్, బన్నీలను ఏమీ అనలేక దేవి నిర్మాతలను నిందించాడా అనే చర్చ కూడా నడుస్తోంది. తెర వెనుక ఏం జరుగుతోందో కానీ.. ‘పుష్ప-2’తో మైత్రీ అధినేతల అవస్థలు మాత్రం అన్నీ ఇన్నీ కావు.