మంచు విష్ణు హీరోగా తన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప ఎట్టకేలకు విడుదల తేదీని లాక్ చేసుకుంది. 2025 ఏప్రిల్ 25 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. నిజానికి ఈ డిసెంబర్ లోనే అనుకున్నారు కానీ పుష్ప 2తో పాటు ఇతర సినిమాల నుంచి పోటీ ఉన్న కారణంగా వాయిదా వేసుకున్నారు. జనవరిలో సంక్రాంతి హడావిడి, ఫిబ్రవరి డ్రై సీజన్, మార్చి పరీక్షలు తదితర కారణాల దృష్ట్యా వేసవి అయితేనే బాగుంటుందనే అభిప్రాయంతో ఫైనల్ గా ఆరు నెలల తర్వాత రావాలని డిసైడయ్యారు. ఇక్కడ రిస్క్ ఎందుకు అనాల్సి వచ్చిందో చూద్దాం.
కన్నప్ప వస్తున్న నెలలోనే ఏప్రిల్ 10న ప్రభాస్ ‘ది రాజా సాబ్’ దిగుతాడు. ప్యాన్ ఇండియా స్థాయిలో దీని మీద ఉన్న అంచనాల గురించి చెప్పనక్కర్లేదు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా చూడని హారర్ గ్రాండియర్ ని చూస్తారని నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఆ మధ్య చెప్పడం హైప్ పెంచేసింది. దానికి తోడు వింటేజ్ ప్రభాస్ ని చూపించే హామీ దర్శకుడు మారుతీ ఎప్పుడో ఇచ్చాడు. సో పాజిటివ్ టాక్ వస్తే రాజా సాబ్ దూకుడు కనీసం మూడు వారాలు ఉంటుంది. ఏప్రిల్ 18 ఇదే బ్యానర్ నుంచి తేజ సజ్జ ‘మిరాయ్’ రాబోతోంది. ఇది కూడా వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న విజువల్ గ్రాండియరే.
వీటి తర్వాత కన్నప్ప రావడం రైటే కానీ అవి థియేటర్లలో ఆడుతుండగా జనాలను ఇటువైపు తిప్పుకోవడం విష్ణుకి సవాలే. కన్నప్పలో ప్రభాస్ క్యామియో ఉన్నా కేవలం అదొక్క అంశం లాంగ్ రన్ తీసుకురాదు. అయితే కంటెంట్ మీద నమ్మకంతో ఉన్న విష్ణు ఇప్పటిదాకా శివభక్తుడి గాథ ఎవరూ చూపించినంత గొప్పగా ఆవిష్కరిస్తామని ఊరిస్తున్నాడు. సో అన్ని రకాలుగా ఆలోచించే కాంపిటీషన్ కు సిద్ధపడుతున్నారని అనుకోవచ్చు. ఆపై రెండు వారాలు దాటడం ఆలస్యం మే 9 చిరంజీవి ‘విశ్వంభర’ వచ్చే ఛాన్స్ ఉంది. రవితేజ ‘మాస్ జాతర’ ఆల్రెడీ లాక్ చేసుకుంది. సో కన్నప్పకు పెద్ద కాంపిటీషనే స్వాగతం చెప్పనుంది.