దసరాను వదిలేద్దాం.. దీపావళికి చూద్దాం

టాలీవుడ్‌కు సంబంధించినంత వరకు సినిమాల విడుదలకు అత్యంత ఆకర్షణీయమైన పండుగ సీజన్లలో మొదటిది సంక్రాంతి కాగా.. రెండోది దసరా. ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో బాక్సాఫీస్ మోత మోగిపోయింది. కానీ దసరాకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా తల్లకిందులైపోయింది. ఈసారి పెద్ద సినిమాల సంగతలా ఉంచితే చిన్న సినిమాలైనా కొత్తవి విడుదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

ఏడు నెలలు మూత పడి ఉన్న థియేటర్లను దసరాకు పది రోజుల ముందు, అంటే అక్టోబరు 15న పున:ప్రారంభించబోతున్నారు. కానీ వెంటనే కొత్త సినిమాలు ఏవీ రిలీజయ్యే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. దసరా సీజన్లో రిలీజ్ కోసం సినిమాలు పోటీ పడే అవకాశమే లేదు. థియేటర్లు తెరుస్తున్నాం.. ఎన్ని కావాంటే అన్నిస్తాం కొత్త సినిమాలు రిలీజ్ చేయండి మహాప్రభో అని ఎగ్జిబిటర్లు అడుగుతున్నా విడుదల చేసే పరిస్థితి లేదు.

కరోనా భయం, థియేటర్లలో షరతుల నేపథ్యంలో ప్రేక్షకులు ఏమాత్రం సినిమాలు చూసేందుకు వస్తారన్న సందేహముంది. పైగా అసలే 50 శాతం ఆక్యుపెన్సీ, అందులో ఎన్ని సీట్లు నిండుతాయో తెలియదు. కాబట్టి రెవెన్యూ మీద పెద్దగా ఆశల్లేవు. ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధంగా న్న సినిమాలను కూడా దసరాకు రిలీజ్ చేయలేని పరిస్థితి. దీంతో బంగారం లాంటి దసరా సీజన్‌ను వదులకోక తప్పేలా లేదు.

ముందైతే థియేటర్లు తెరవడానికి అనుమతి ఇచ్చారు కాబట్టి రెండు మూడు వారాల తర్వాత ఫుల్ ఆక్యుపెన్సీ కోసం ప్రభుత్వాలకు సినీ పరిశ్రమ నుంచి విజ్ఞప్తులు వెళ్తాయని భావిస్తున్నారు. మిగతా అన్ని చోట్లకూ జనాలను మామూలుగానే అనుమతిస్తూ.. థియేటర్ల విషయంలో వివక్ష ఏంటంటూ తమ గోడు వెల్లబోసుకుని, కొంచెం గట్టిగా ఒత్తిడి చేసి మునుపట్లా థియేటర్లు నడిచేలా చేసుకోవాలని సినీ పెద్దలు యోచిస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలిస్తే నవంబరు 14న దీపావళికి ఏమైనా థియేటర్లు ఫుల్ ఆక్యుపెన్సీతో నడిచే పరిస్థితులు రావచ్చేమో. అది కాదంటే క్రిస్మస్ లేదా సంక్రాంతి. అప్పటిదాకా పేరున్న కొత్త సినిమాలేవీ రిలీజయ్యే అవకాశాలు కనిపించడం లేదు.