ఎప్పుడూ చూసే వ్యవహారమే అయినా మెకానిక్ రాకీ విషయంలో విశ్వక్ సేన్ చూపించిన కాన్ఫిడెన్స్ సినిమా నిజంగా బాగుందేమోననే అంచనాలు రేకెత్తించాయి. బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ రాలేదు కానీ ఉన్నంతలో సెకండాఫ్ నెట్టుకొచ్చిందని, ట్విస్టుల కోసమైనా ఓసారి చూడొచ్చనే టాక్ బయటికొచ్చింది. కానీ థియేటర్ల దగ్గర ఆశించిన స్థాయిలో జనం లేరు. భారీ ఓపెనింగ్స్ ఎదురుచూసిన విశ్వక్ కు ఇది ఊహించని పరిణామం. క్రాస్ రోడ్స్ సుదర్శన్ దగ్గర ఉదయం ఆటకు పబ్లిక్ ఫుల్ ఉండొచ్చు కానీ తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల సగం షోలు కూడా నిండలేదని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. భారమంతా వీకెండ్ మీదే.
ఇన్సూరెన్స్ మోసాల చుట్టూ కథ రాసుకున్న దర్శకుడు రవితేజ ముళ్ళపూడి కీలక మలుపులను హ్యాండిల్ చేసిన విధానం పర్వాలేదని అనిపించనప్పటికీ మరీ అత్తెసరుగా ఉన్న ఫస్ట్ హాఫ్ బాగానే డ్యామేజ్ చేసింది. మూడు కొత్త రిలీజుల్లో ఇదే బెటరనే ఫీడ్ బ్యాక్ ఒక్కటే మెకానిక్ రాకీకి ఊరట కలిగించిన అంశం. అయితే ఇది వసూళ్లుగా మార్పు చెందినప్పుడే హిట్ అనిపించుకుంటుంది. కానీ అది సాధ్యమవుతుందా లేదానేది సోమవారానికి కొంత క్లారిటీ వస్తుంది. దీపావళికి అమరన్, లక్కీ భాస్కర్, క చేసిన హడావిడి ఇప్పుడీ మెకానిక్ రాకీ, జీబ్రాలు చేయలేకపోవడం డిస్ట్రిబ్యూటర్ల ఆందోళనకు కారణం.
ఎలాగూ ఇంకో పది రోజుల్లో పుష్ప 2 వస్తుంది కాబట్టి అప్పుడు థియేటర్లకు వెళదామని జనం ఆగుతున్నారో లేక యునానిమస్ టాక్ రాలేదు కాబట్టి ఆ తర్వాత చూద్దాంలే అని రావట్లేదో బయ్యర్లకు అంతు చిక్కడం లేదు. విశ్వక్ సేన్ గత సినిమాలు గ్యాంగ్స్ అఫ్ గోదావరి, మాస్ కా దాస్ లాంటి వాటికి డీసెంట్ నుంచి స్ట్రాంగ్ ఓపెనింగ్ దక్కింది. ప్రయోగంగా చేసిన గామి సైతం ఓకే అనిపించుకుంది. కానీ మెకానిక్ రాకీ స్పీడ్ దానికి భిన్నంగా ఉండటం ఆశ్చర్యం కలిగించేదే. ఇవాళ, రేపు ఆదివారం కీలకం కాబోతున్నాయి. అనూహ్యంగా పికప్ అయిపోయి వీలైనంత రాబట్టుకుంటేనే రాకీ సేఫ్ అవుతాడు.