నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావులను తెలుగు సినిమాకు రెండు కళ్లుగా చెప్పేవారు ఒకప్పుడు. వీళ్లిద్దరూ ఎవరి స్థాయిలో వాళ్లు అద్భుతమైన పాత్రలు, గొప్ప చిత్రాలతో తెలుగు సినిమాపై తమదైన ముద్ర వేశారు. ఎన్నో ఘనవిజయాలు అందుకున్నారు. ఎన్టీఆర్ మాస్ చిత్రాలతో తిరుగులేని స్థాయి అందుకుంటే.. ఏఎన్నార్ క్లాస్ సినిమాలతోనే గొప్ప స్థాయిని అందుకున్నారు.
తొలి తరం ట్రెండుకు తగ్గట్లుగా ఎన్టీఆర్‌లాగా ఎక్కువగా పౌరాణిక చిత్రాలు చేయకపోయినా.. ఆహార్యం, వాచకం లాంటి విషయాల్లో ఎన్టీఆర్ ముందు నిలవలేకపోయినా.. తర్వాతి దశలో మాస్ చిత్రాలు పెద్దగా చేయకపోయినా.. ఎన్టీఆర్‌కు దీటుగా ఏఎన్నార్ నిలబడడం మామూలు విషయం కాదు. తనకున్న పరిమితుల్లోనే తిరుగులేని విజయాలు సాధించిన ఏఎన్నార్.. తన కెరీర్ ఆరంభంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారంటే షాకవ్వక తప్పదు. గోవాలో జరుగుతున్న ఐఎఫ్ఎఫ్ఐ వేడుకల్లో మాట్లాడుతూ నాగ్ ఈ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.
“నాన్నగారు నాటకాలు వేసే సమయానికి మహిళలు నటనలోకి వచ్చేవాళ్లు కాదు. దీంతో ఆయన స్టేజ్ మీద ఆడవాళ్ల పాత్రలు వేసేవారు. ఆయన అరంగేట్రం చేసిందే హీరోయిన్ పాత్రతో. ఐతే అమ్మాయిలా కనిపించడం, అమ్మాయిలా మాట్లాడ్డంతో ఆయన్ని చాలామంది ఎగతాళి చేసేవారు. దీంతో ఆయన అవమానంగా భావించి ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు. మద్రాస్ మెరీనా బీచ్‌కు వెళ్లి నీళ్లలోపలికి వెళ్లిపోయారు. కానీ అప్పుడే అది సరైన పని కాదని తన మనసు చెప్పింది. దీంతో వెనక్కి వచ్చేశారు.
తర్వాత ఘంటసాల బలరామయ్య గారు రైల్వే స్టేషన్లో నాన్నగారిని చూడడం, సినిమాల్లో నటిస్తావా అని అడగడం.. అలా సినీ రంగంలో అడుగు పెట్టడం అదంతా ఒక చరిత్ర. సినిమాల్లోకి వచ్చాక కూడా తన వాచకం విషయంలో నాన్న చాలా ఇబ్బంది పడ్డారు. రఫ్ వాయిస్ తెచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు. సిగరెట్ తాగితే వాయిస్ రఫ్ అవుతుందంటే అదీ ప్రయత్నించారు. వాయిస్ మార్చుకోవడానికి ఉదయమే బీచ్ దగ్గరికి వెళ్లి ఐదు పది నిమిషాల పాటు గట్టిగా అరవడం లాంటివి కూడా చేశారు” అని నాగ్ వెల్లడించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates