యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్ షూటింగ్ చివరిదశకు చేరుకుంది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో చైతూ మరో బిగ్గెస్ట్ హిట్ అందుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.
తండేల్ పూర్తికాగానే, నాగచైతన్య తన తదుపరి సినిమా షూటింగ్‌ను డిసెంబర్ 12న హైదరాబాదులో ప్రారంభించనున్నాడు. ఈ సినిమా కోసం విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఒక మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు వైవిధ్యమైన అనుభవాన్ని అందించనుంది. ఇందులో కథానాయికలుగా మీనాక్షి చౌదరి, పూజా హెగ్డేలు కనిపించనున్నారని సమాచారం.
ఇక సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు ఒకదాని తరువాత ఒకటి వెలుగులోకి వస్తున్నాయి. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సుమారు రూ. 110 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారని సమాచారం. ఇందులో రూ. 30 కోట్లను కేవలం విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఖర్చు చేయనున్నారట. విజువల్ ఎఫెక్ట్స్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ద్వారా ఈ చిత్రాన్ని అగ్ర స్థాయి థ్రిల్లర్‌గా మార్చాలని మేకర్స్ భావిస్తున్నారు.
చిత్ర బృందం ఈ కథను ఉత్తర భారతదేశంలోని పలు డిఫరెంట్ లొకేషన్లలో షూట్ చేయాలని నిర్ణయించింది. ఈ లొకేషన్లు కథకు కీలకమని, ప్రేక్షకులకు మిస్టిక్ వాతావరణాన్ని అందించగలవని టాక్. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. షూటింగ్ ప్రారంభానికి ముందు నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు. మేకర్స్ కథతో పాటు టెక్నికల్ అంగాలపై కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఈ సినిమా నాగచైతన్య కెరీర్‌లో మరో బిగ్ రికార్డ్ గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. 2025లో చైతూ తన మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకువెళ్తాడని అనిపిస్తోంది.