వావ్….నాగార్జున చేతికి డాల్బీ విజన్

ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన ఆస్వాదిస్తున్న తన్మయత్వంలో లోపాలు కనిపించేవి కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. టెక్నాలజీ ప్రవేశించాక ఆడియన్స్ ఎంత ఖర్చయినా సరే బెస్ట్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేస్తున్నారు. అందుకే డిటిఎస్ సౌండ్, రిక్లైనర్ సీట్లు, సోఫాలు, మల్టీప్లెక్సులు, డైరెక్టర్స్ కట్ ఆడిటోరియంలు, 3డి, 4డిఎక్స్ ఇలా రకరకాల సాంకేతికతలు కొత్త విప్లవాన్ని తీసుకొచ్చాయి. డాల్బీ అట్మోస్ గత కొన్నేళ్లలో సౌండ్ రివల్యూషన్ లో మార్పుకి నాంది పలికింది.

ఇప్పుడు డాల్బీ విజన్ అనే మరో టెక్నాలజీని నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ కు తెచ్చేశారు. తాజాగా గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ కబురుని పంచుకున్నారు. తమ ప్రాంగణంలో ఉన్న అంతర్జాతీయ సౌకర్యాలను గమనించిన డాల్బీ సంస్థ దాన్ని తమకే అందించిందని ప్రకటించారు. ఇండియాలో ఇది మొదటిదని, ఇకపై ఎవరైనా దర్శక నిర్మాతలు ఆ క్వాలిటీలో సినిమా కావాలంటే తమనే సంప్రదించాలని చెప్పారు. గతంలో డాల్బీ విజన్ ఇక్కడ లేనందువల్లే రాజమౌళి ఆర్ఆర్ఆర్ ని జర్మనీలో చేయించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. పుష్ప 2 ది రూల్ ని డాల్బీ సినిమా టెక్నాలజీలో తెచ్చే పనులు జరుగుతున్నాయని ప్రకటించారు. దాని ప్రత్యేకత ఏముందో చూద్దాం.

మనం థియేటర్, స్మార్ట్ టీవీ, ప్రొజెక్టర్ లో చూస్తున్న 4K కంటే మెరుగ్గా డాల్బీ సినిమా ఉంటుంది. అబ్బురపరిచే రంగులు, రెజల్యూషన్, హై డైనమిక్ రేంజ్ (HDR) స్పష్టత, కెమెరా అందిపుచ్చుకున్న ప్రతి డీటెయిల్ ని స్పష్టంగా చూపించే సజీవ నైపుణ్యం ఇలా ఎన్నో విశేషాలతో డాల్బీ విజన్ చూస్తున్న వాళ్ళను మరో లోకంలోకి తీసుకెళ్తుంది. నిజమైన కంటితో చూసేదాన్ని కన్నా ఎక్కువ క్లారిటీ దీంట్లో ఉంటుందనిపిస్తే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12 డాల్బీ అట్మోస్ మిక్సింగ్ థియేటర్లలో తమది ఒకటైనందుకు నాగ్ సంతోషం వ్యక్తం చేశారు. వరల్డ్ స్టాండర్డ్ లో అన్నపూర్ణ స్టూడియోని తీర్చిదిద్దుతున్నారు.