భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు. ఆస్కార్ అవార్డు సాధించిన తొలి భారతీయ సంగీత దర్శకుడిగా రెహమాన్ చరిత్రపుటలకెక్కాడు. హాలీవుడ్ చిత్రాలకు కూడా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించి భారతీయ సంగీత దర్శకుల సత్తా చాటారు. ఈ క్రమంలోనే తాజాగా ఏఆర్ రెహమాన్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.
హాలీవుడ్ మ్యూజిక్ ఇన్ మీడియా అవార్డ్స్ 2024 గాను విదేశీ భాష కేటగిరీలో ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ కు అవార్డు దక్కింది. ‘‘ఆడు జీవితం’’ మలయాళ చిత్రానికి అందించిన నేపథ్య సంగీతానికిగాను రెహమాన్ కు ఈ అవార్డు దక్కింది. విదేశీ భాష కేటగిరీలో ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా రెహమాన్ ఈ అవార్డు సొంతం చేసుకున్నారు.
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ చిత్రానికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. రెహమాన్ తరఫున ఈ అవార్డును బ్లెస్సీ అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈ అవార్డు దక్కించుకున్న సందర్భంగా రెహమాన్ హర్షం వ్యక్తం చేస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ అవార్డు దక్కడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని, ఆడు జీవితం చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని రెహమాన్ అన్నారు. తన సంగీత బృందంతో టెక్నీషియన్ లతో ఈ అవార్డును పంచుకుంటానని రెహమాన్ చెప్పారు.ఆడు జీవితం చిత్ర దర్శకుడు బ్లెస్సీ అవార్డు అందుకుంటున్న వీడియోను పృథ్వీరాజ్ సుకుమారన్ ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.