ఇంకో పధ్నాలుగు రోజుల్లో పుష్ప 2 ది రూల్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. ప్రస్తుతం చివరి పాట షూటింగ్ లో తలమునకలైన దర్శకుడు సుకుమార్ టీమ్ మొత్తాన్ని ముళ్ళమీద పరిగెత్తిస్తున్నారు. రెండు వారాల గ్యాప్ లోనే మిగిలిన ప్రమోషన్ ఈవెంట్లతో పాటు మీడియా ఇంటర్వ్యూలు వగైరా పూర్తి చేసుకోవాలి. హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అనిల్ తదాని బాహుబలి, ఆర్ఆర్ఆర్ రేంజ్ లో స్క్రీన్లు వచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పోటీగా వస్తుందనుకున్న చావా తప్పుకోవడంతో పుష్ప 2కి దేశవ్యాప్తంగా సోలో రిలీజ్ దక్కనుంది. కాంపిటీషన్ వచ్చేందుకు ఎవరూ సిద్ధపడటం లేదు.
ఇదిలా ఉండగా పుష్ప 2 వెయ్యి కోట్లు సాధిస్తుందా లేదానే దాని మీద రకరకాల అంచనాలు, విశ్లేషణలు జరుగుతున్నాయి. ఫాంటసీ, గ్రాఫిక్స్ లేని ఒక మాస్ కమర్షియల్ సినిమా ఆ మైలురాయి అందుకోవడం అంత సులభం కాదు. కానీ పుష్ప 2 మేనియా చూస్తుంటే సాధ్యం కాదని చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే నార్త్ ఆడియన్స్ ని కనక సుకుమార్ మెప్పిస్తే అక్కడ ఎంతలేదన్నా బాలీవుడ్ నుంచే మూడు వందల కోట్ల దాకా రాబట్టొచ్చు. ఏపీ, తెలంగాణ, ఇతర ఉత్తరాది రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి ఎంతలేదన్నా ఆరేడు వందల కోట్ల గ్రాస్ సులభంగా లాగేస్తాడు. మొత్తం వెయ్యి కోట్ల లెక్క ఇక్కడే వచ్చేసింది.
ఒకవేళ బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే ఊచకోత ఇంతకు మించి ఉంటుంది. ఎందుకంటే అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండింటిలోనూ గత కొన్ని నెలలుగా ఊర మాస్ బొమ్మ లేదు. దేవర ఒక్కటే విజయం సాధించింది. కానీ వెయ్యి కోట్లు సాధ్యం కాలేదు. అయిదు వందలు దాటాక నెమ్మదించింది. కానీ పుష్ప 2 కేసు వేరు. బాగుందనే మాట వస్తే చాలు ఊచకోత మాములుగా ఉండదు. టికెట్ రేట్ల పెంపు అడ్వాంటేజ్ అదనం. జనవరి 20 కొత్త రిలీజులు వచ్చేదాకా పదిహేను రోజుల సమయం దొరుకుంటుంది. బాహుబలి, రాజమౌళి, కెజిఎఫ్ రికార్డులను గురిపెట్టుకున్న పుష్ప 2 అన్నంత పని చేస్తే మాత్రం సరికొత్త చరిత్ర లిఖితమవుతుంది.