ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే బాలీవుడ్డే అనే పరిస్థితి ఉండేది. బాలీవుడ్ ముందు మిగతా ఇండస్ట్రీలు నిలిచేవి కావు. కానీ ఇప్పుడు సౌత్ సినిమాలు ఇంతింతై అన్నట్లు ఎదిగిపోతున్నాయి. ఈ ఇండస్ట్రీలు పెద్దవైపోతుంటే.. బాలీవుడ్ ముందున్న స్థాయిలో కూడా నిలవలేకపోతోంది.
అక్కడ్నుంచి వస్తున్న పెద్ద పెద్ద సినిమాలక కూడా ఓపెనింగ్స్ కరవైపోతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సెలబ్రెటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఒక మీడియా సంస్థ నిర్వహించిన చర్చా వేదికలో పాల్గొన్న అగ్ర కథానాయకులు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్.. బాలీవుడ్ హీరోల్లో ఐకమత్యం కొరవడడం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సౌత్ హీరోలు చాలా బెటర్ అని వాళ్లు అభిప్రాయపడ్డారు.
‘‘అవును. బాలీవుడ్ హీరోల్లో ఐకమత్యం లేదు. ఈ విషయంలో అజయ్ ఏమనుకుంటున్నాడో నాకు తెలియదు’’ అని అక్షయ్ వ్యాఖ్యానించగా.. అక్షయ్ మాటలు నిజమే అని అజయ్ అన్నాడు. తర్వాత కొనసాగిస్తూ.. ‘‘దీని గురించి మేం ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాం. సినిమాకు ఓపెనింగ్స్ రావడం, రాకపోవడం అన్నది వేరే విషయం. అందులో చాలా విషయాలు ముడిపడి ఉంటాయి. కానీ దక్షిణాది హీరోలు అవసరమైనపుడు ఒకరి కోసం ఒకరు నిలబడతారు. ఒక ఇండస్ట్రీగా కలిసి కట్టుగా సాగుతారు. ముంబయి ఫిలిం ఇండస్ట్రీలో అది లేకపోవడం బలహీనత. కనీసం మా తరం హీరోలు ఒకరి కోసం ఒకరం నిలబడతాం. కానీ యువ హీరోల్లో ఆ ఐకమత్యం ఎంతమాత్రం లేదు. 90ల నుంచి నేను, అక్షయ్, షారుఖ్, సల్మాన్, ఆమిర్ కలిసి సాగుతున్నాం. మా మధ్య ఎప్పుడూ ఘర్షణ లేదు. కానీ యువతరంలో మాత్రం ఇది లేదు. బాలీవుడ్లో ఐకమత్యం లోపించింది. గౌరవం లోపించింది. ఇది పెద్ద విషయం” అని అజయ్ అన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates