నిన్న జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకవేళ హైదరాబాద్ అయ్యుంటే ఎలా ఉండేదో కానీ పాట్నాలో వచ్చిన స్పందన చూసి నేషనల్ మీడియా సైతం షాక్ తింది. నాలుగు వందలకు పైగా పోలీస్ ప్లస్ ప్రైవేట్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నప్పటికీ రద్దీ నియంత్రించడానికి చుక్కలు కనిపించాయంటే బీహార్ జనాలు పుష్పని ఎంతగా స్వంతం చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. పాతిక వేల జనాలని ఆశిస్తే రెండు లక్షలకు పైగా రావడం నిర్వాహకులు ఊహించలేదు. పాసులు బ్లాక్ లో అమ్మారంటేనే పీక్స్ క్రేజని వేరే చెప్పాలా. కనివిని ఎరుగని జన సందోహం చూసి స్థానిక రాజకీయ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి.
కొద్దిరోజుల క్రితం గేమ్ ఛేంజర్ ఈవెంట్ లక్నోలో చేసినప్పుడు కొత్త ఐడియా అనుకున్నారు. కానీ చేసిన ప్రాంగణం చిన్నది కావడం వల్ల జనంతో నిండిపోయినా సరే పదే పదే మాట్లాడుకునే స్థాయిలో కనిపించలేదు. కానీ పుష్ప 2కి అలా కాదు. విపరీతమైన పబ్లిక్, ఎక్కడ చూసినా ఇసుక వేసినా రాలనంత జనం. ఆన్ లైన్ స్ట్రీమింగ్ లోనూ మూడు లక్షలకు కొంచెం అటుఇటుగా లైవ్ లో చూశారు. తెలుగు రాష్ట్రాల అభిమానులు న్యూస్ ఛానల్స్ ని ఎంచుకున్నారు. మొత్తానికి పుష్ప 2 మానియా చూస్తుంటే ర్యాంపేజ్ అనే మాట చిన్నది అనిపిస్తోంది. కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడు మొదలైంది.
ఇంకో ఆరు ఈవెంట్లను పుష్ప 2 కోసం ప్లాన్ చేసుకున్నారు. అవి ఖచ్చితంగా పాట్నాను తలపించే స్థాయిలో జరగాలి. ట్రైలర్ చూశాక పెరిగిన హైప్ గమనిస్తే అదేం కష్టం కాదనిపిస్తోంది. విడుదలకు కేవలం ఇంకో పదిహేడు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో అందరూ ఉరుకులు పరుగుల మీదున్నారు. దర్శకుడు సుకుమార్ ఎక్కువ శాతం వేడుకలకు హాజరయ్యే పరిస్థితి లేదు. చివరి నిమిషం పనుల్లో బిజీగా ఉన్నారు. నిర్మాతలు నవీన్, రవి, ఉత్తరాది డిస్ట్రిబ్యూటర్ అనిల్ తదాని పాట్నా ఈవెంట్ బ్లాక్ బస్టర్ కావడం చూసి మాములు ఆనందంలో లేరు. ఓపెనింగ్స్ మీద నమ్మకానికి ఇది పునాది మాత్రమే.