టాలీవుడ్ బాక్సాఫీస్ మరో ఆసక్తికరమైన క్లాష్ కు సిద్ధమయ్యింది. ఆయా హీరోలకు తమ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన రెండు సినిమాలు పోటీకి సిద్ధపడటం ఆసక్తి రేపుతోంది. మొదటిది కంగువ. పేరుకి డబ్బింగ్ మూవీ అయినప్పటికీ సూర్యకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫాలోయింగ్ వల్ల మంచి ఓపెనింగ్స్ కి రంగం సిద్ధమయ్యింది. పివిఆర్, ఏషియన్ లతో మైత్రికి బిజినెస్ పరంగా తలెత్తిన ఇష్యూ కారణంగా అడ్వాన్స్ బుకింగ్స్ లో విపరీతమైన జాప్యం జరిగినప్పటికీ ఆడియన్స్ మాత్రం ఈ గ్రాండియర్ ని చూసేందుకు రెడీగా ఉన్నారు. ట్రైలర్లు, పాటలు, సూర్య గెటప్, వందల కోట్ల బడ్జెట్ అంచనాలు పెంచేశాయి.
కాకపోతే బాహుబలి, కెజిఎఫ్ రేంజ్ కంటే ఎక్కువగా ఉంటుందని దర్శక నిర్మాతలు ఊరిస్తున్నారు కాబట్టి ఆ ఒత్తిడిని తట్టుకుని మెప్పిస్తే రికార్డుల పరంగా అద్భుతాలు సృష్టిస్తుంది. ఇక మట్కా మీద అంతగా హైప్ కనిపించకపోయినా దర్శకుడు కరుణ కుమార్ మాత్రం ఇంకో ఇరవై సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపెట్టుకునే స్థాయిలో ఉంటుందని చెప్పడం చూస్తే కంటెంట్ మీద ఎంత నమ్మకముందో అర్థమవుతుంది. వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. వరస డిజాస్టర్ల నుంచి నేర్చుకుని పొరపాట్లు లేకుండా మట్కా విషయంలో జాగ్రత్త తీసుకున్నామని చెబుతున్నాడు కనక అభిమానులు ఆశలు పెట్టుకోవచ్చనేలా ఉంది.
కంగువ, మట్కా సక్సెస్ అయితే దీపావళి మూడు హిట్లు ఇచ్చిన జోష్ వీటి నుంచి కొనసాగుతుంది. అమరన్, లక్కీ భాస్కర్, క క్రమంగా నెమ్మదించిన నేపథ్యంలో బయ్యర్ల ఆశలన్నీ వరుణ్ తేజ్, సూర్యల మీద ఉన్నాయి. బాలీవుడ్ వైపు నుంచి పెద్దగా పోటీ లేకపోవడం కలిసి వచ్చే అంశం. అంతగా బజ్ లేని సబర్మతి రిపోర్ట్ గురించి టెన్షన్ పడేందుకు ఏమి లేదు. వచ్చే వారం మెకానిక్ రాకీ, దేవకీనందన వాసుదేవ, జిబ్రాలతో ట్రయాంగిల్ పోటీ ఉన్న నేపథ్యంలో మొదటి వారం కంగువ, మట్కాలకు పాజిటివ్ టాక్ చాలా కీలకం. ఓవర్సీస్ రిపోర్ట్స్ పాజిటివ్ గా వినిపిస్తున్నాయి. చూడాలి మరి విజేతలు సంయుక్తంగా ఉంటారో లేదో.