రాబిన్ హుడ్ అంటే చిరంజీవి కొండవీటి దొంగే

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ డిసెంబర్ విడుదలకు రెడీ అవుతోంది. తొలుత 20 డేట్ ప్రకటించారు కానీ ఇప్పుడది 25కి మారొచ్చని ఫిలిం నగర్ టాక్. ఓవర్సీస్ లో ముఫాసా లాంటి హాలీవుడ్ మూవీ నుంచి వస్తున్న ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు కానీ గురువారం రిలీజ్ కాబోయే టీజర్ ద్వారా స్పష్టత వస్తుంది. భీష్మ బ్లాక్ బస్టర్ తర్వాత రిపీట్ అవుతున్న కలయికగా రాబిన్ హుడ్ మీద పెద్ద అంచనాలున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీనికి ఒకప్పటి చిరంజీవి సూపర్ హిట్ కొండవీటి దొంగకు పోలికలు ఉన్నాయట.

ఎలా అంటే రాబిన్ హుడ్ కథాంశం హీరో దొంగతనాలు చేయడం మీద నడుస్తుంది. ఉన్నవాడిని దోచిపెట్టి లేనివాడికి పంచిపెట్టమనేది హీరో సిద్ధాంతం. కాకపోతే ఆ చోరీలు సరికొత్తగా, వినూత్నంగా గతంలో చూడని రీతిలో ఉంటాయి. కొండవీటి దొంగలో చిరంజీవి ముఖానికి నల్లని ముసుగు వేసుకుని విలన్లను దోచుకుంటూ ఉంటాడు. ఇప్పుడీ నితిన్ పోషిస్తున్న రాబిన్ హుడ్ ఫేసుకు అదే తరహాలో మాస్క్ ఉంటుంది. బ్యాక్ డ్రాప్ కొంచెం సీరియస్ గా అనిపిస్తున్నా ఫుల్ ఎంటర్ టైనర్ గా వెంకీ కుడుముల దీన్ని రూపొందిస్తున్నారట. హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల నితిన్ కి జోడి కట్టడం మరో అట్రాక్షన్.

సో నితిన్ అభిమానులు బోలెడు ఆశించేలా వెంకీ కుడుముల అన్ని జాగ్రత్తలు తీసుకున్నారన్న మాట. మైత్రి మూవీ మేకర్స్ దీని మీద పెద్ద బడ్జెట్ పెట్టింది. విదేశాల్లో షూటింగ్ చేశారు. ఒకే నెలలో ఈ సంస్థ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. పుష్ప 2 ది రూల్ విధ్వంసం చేసిన రెండు వారాలు లేదా ఇరవై రోజుల్లోనే రాబిన్ హుడ్ దిగిపోతాడు. ఎల్లుండి టీజర్ చూశాక కాన్సెప్ట్ గురించి మరింత క్లారిటీ వస్తుంది. భీష్మ తర్వాత గ్యాప్ వచ్చేసి మెగాస్టార్ మూవీని చేతి దాకా వచ్చి మిస్ చేసుకున్న వెంకీ కుడుముల ఈసారి నితిన్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో పాటు టాప్ లీగ్ లోకి వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉన్నాడు.