ఢిల్లీ గణేష్ అందుకే ప్రత్యేకం 

ప్రముఖ కోలీవుడ్ నటుడు ఢిల్లీ గణేష్ నిన్న రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అనారోగ్యం కారణంగా కన్ను మూయడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగులో చేసిన స్ట్రెయిట్ సినిమాలు తక్కువే అయినప్పటికీ అనువాద చిత్రాల ద్వారా ఈయన మనకు బాగా సూపరించితం. గణేష్ ప్రత్యేకత తెలియాలంటే కొంచెం గతం తెలుసుకోవాలి. ఈ విలక్షణ నటుడి అసలు పేరు గణేషన్. ఇండస్ట్రీకి రాకముందు పది సంవత్సరాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేశారు. ఢిల్లీలో ఉండే దక్షిణ భారత నాటక సభలో కీలక సభ్యుడిగా ఉండేవారు. తొలి అవకాశం ఇచ్చిన బాలచందర్ ఢిల్లీని ఇంటిపేరుగా మార్చారు. 

1976లో పట్టిణ ప్రవేశంతో గణేష్ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఎంగమ్మ మహారాణి (1980) లో హీరోగా నటించారు కానీ ఆడలేదు. కమల్ హాసన్ తో స్నేహం మొదలయ్యాక మంచి వేషాలు వచ్చి క్రమంగా మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు రావడం మొదలైంది. నాయకుడులో దాదాపు సినిమా మొత్తం హీరో పక్కన కనిపించేది ఢిల్లీ గణేష్ ఒక్కరే. ఆ తర్వాత మైఖేల్ మదన కామరాజు, తెనాలి, భామనే సత్యభామనే లాంటి ఎన్నో చిత్రాల్లో మెప్పించారు. విచిత్ర సోదరులులో విలన్ గా నటించింది కమల్ ప్రోత్సాహం వల్లే. 1994లో అప్పటి జయలలిత ప్రభుత్వం కలైమామణి అవార్డుతో ఢిల్లీ గణేష్ ప్రతిభను గుర్తించింది. 

తమిళంలోని అగ్రి హీరోలందరి సినిమాల్లోని నటించిన ఢిల్లీ గణేష్ టీవీ సీరియల్స్ లోనూ విస్తృతంగా కనిపించేవారు. టాలీవుడ్ ఎంట్రీ నాగార్జున జైత్రయాత్ర ద్వారా చేశారు కానీ తర్వాత డేట్ల సమస్య వల్ల ఆఫర్లు వచ్చినా సరే తెలుగు దర్శకులకు నో చెప్పేవారు. చాలా గ్యాప్ తర్వాత నాయుడమ్మ, పున్నమినాగులో చేశారు. 80 సంవత్సరాల వయసులోనూ ఢిల్లీ గణేష్ నటనే ప్రాణంగా బ్రతికారు. ఈ ఏడాది వచ్చిన భారతీయుడు 2, బాక్ అరణ్మయి 4, విశాల్ రత్నంలో కీలక పాత్రలు చేశారు. ఇంత సుదీర్ఘమైన ప్రయాణం ఉంది కాబట్టి భాషతో సంబంధం లేకుండా ఢిల్లీ గణేష్ ప్రేక్షకులకు మధ్యతరగతి తండ్రిగా గుర్తుండిపోయారు.