పుష్ప 2 బీజీఎమ్ – దేవి స్థానంలో ఎవరు ?

ఇంకో నెల రోజుల కన్నా తక్కువ వ్యవధిలో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ గురించి హఠాత్తుగా వచ్చిన వార్త అభిమానులతో పాటు ఇండస్ట్రీలోనూ కలకలం రేపుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయించబోతున్నట్టు తెలిసి ఫ్యాన్స్ షాక్ తింటున్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా నిప్పు లేనిదే పొగరాదని చివరి నిమిషంలో ఇలాంటి న్యూసులు బయటికి రావుగా. దేవి బీజీఎమ్ పట్ల హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ఇద్దరూ అసంతృప్తిగా ఉన్నారనే నేపథ్యంలో మార్పుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇంకా అఫీషియల్ కాలేదు.

నిజానికి పుష్ప 1 ది రైజ్ కు సైతం నేపధ్య సంగీతం విషయంలో నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. పాటలు అద్భుతంగా కంపోజ్ చేసినప్పటికీ కొన్ని చోట్ల మినహా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆశించిన స్థాయిలో లేదని రివ్యూలలో సైతం ప్రస్తావించారు. సరే బ్లాక్ బస్టర్ సక్సెస్ లో అదంతా కొట్టుకుపోవడం, ఆ తర్వాత నేషనల్ అవార్డు రావడం జరిగిపోయాయి. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యేలా ఉండటంతో దేవికి బదులు తమన్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిసింది. అజనీష్ లోకనాథ్ పేరు కూడా వినిపిస్తోంది కానీ దానికి సంబంధించిన ధ్రువీకరణ ఇంకా రావాల్సి ఉంది. మొత్తానికి ఇదో బ్లాస్టింగ్ సెన్సేషన్.

బన్నీ, శ్రీలీల స్పెషల్ సాంగ్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సుకుమార్ ఈ టాపిక్ మీద స్పందించేందుకు అందుబాటులో లేరు. ఇరవై ఎనిమిది రోజుల్లో రిలీజ్ డేట్ వచ్చేస్తుంది. ఓవర్సీస్ కి డ్రైవ్స్ పంపాలి. సెన్సార్ చేయించాలి. ప్రమోషన్లు చూసుకోవాలి. ట్రైలర్ లాంచ్ నవంబర్ 15 లాక్ చేసుకున్నారు. ఇంత టైట్ షెడ్యూల్ లో దేవిశ్రీ ప్రసాద్ ని వద్దనుకునే నిర్ణయం పెద్ద సాహసమే. ఆ మధ్య హైదరాబాద్ లో జరిగిన లైవ్ కన్సర్ట్ కోసం ఎక్కువ సమయం ఖర్చు పెట్టిన దేవి దాని వల్లే పుష్ప 2 క్వాలిటి సమయం ఇవ్వలేదనే కామెంట్ ఉంది. బోలెడు ప్రశ్నలు తలెత్తాయి. టెన్షన్ తో అభిమానులు సతమతమవుతున్నారు.