సోలో బ్రతుకే సో బెట‌ర్‌.. ఫ్రీ కాదు

థియ‌ట్రిక‌ల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీకి రిలీజైన తెలుగు సినిమాల్లో గ‌త నెల వ‌ర‌కు చాలా వ‌ర‌కు చిన్న చిత్రాలే. గ‌త నెల‌లో వి లాంటి పెద్ద సినిమా విడుద‌లై ఎక్కువ మంది ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించింది. తాజాగా నిశ్శ‌బ్దం లాంటి మ‌రో పెద్ద సినిమా విడుద‌లైంది. ఇక ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన వాటిలో ఒక స్థాయి సినిమా అంటే సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌యే.

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్, హాట్ హీరోయిన్ న‌భా న‌టేష్ జంట‌గా సుబ్బు అనే కొత్త ద‌ర్శ‌కుడు రూపొందించిన ఈ చిత్రాన్ని సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ నిర్మించారు. తేజు చిత్ర‌ల‌హ‌రి, ప్ర‌తిరోజూ పండ‌గే లాంటి హిట్ల త‌ర్వాత న‌టించిన సినిమా కావ‌డం, టీజ‌ర్ కూడా ఆక‌ట్టుకోవ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ స్ట్రీమింగ్ హ‌క్కుల్ని జీ5 ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఐతే ఆ సంస్థ త‌మ స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు ఉచితంగా ఈ సినిమాను చూపించ‌ట్లేదు. ఇప్ప‌టికే క‌పేర‌ణ‌సింగం అనే త‌మిళ చిత్రాన్ని, ఖాలిపీలి అనే హిందీ చిత్రాన్ని జీప్ల‌స్ పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో రిలీజ్ చేసింది. వీటికి వ‌రుస‌గా 199, 299 రేటు పెట్టారు. ఇదే త‌ర‌హాలో సోలో బ్ర‌తుకే సో బెట‌ర్ చిత్రాన్ని కూడా పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో అతి త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నార‌ట.

ఐతే ఆ చిత్రానికి ఎంత రేటు పెడ‌తార‌న్నది ఆస‌క్తిక‌రంగా మారింది. ఓవైపు స‌బ్‌స్క్రిప్ష‌న్‌కు డ‌బ్బులు క‌ట్టి మ‌ళ్లీ ఒక సినిమా మీద ఇంతేసి డ‌బ్బులు పెట్టి వీక్షించాలంటే క‌ష్ట‌మే. ప్ర‌స్తుతం రిలీజ్ చేసిన రెండు సినిమాల‌కు వ‌చ్చే స్పంద‌న‌ను బ‌ట్టి తేజు సినిమాకు రేటు ఫిక్స్ చేసే అవ‌కాశ‌ముంది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ట‌.