ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్లలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ఒకవేళ మీకు క్లైమాక్స్ నచ్చకపోయినా, కొత్తగా అనిపించకపోయినా సినిమాలు మానేస్తానని పెద్ద స్టేట్ మెంట్ ఇవ్వడం చూసి చాలా మంది తొందపడ్డాడేమో అనుకున్నారు. ఇలాంటి కాన్ఫిడెన్స్ గతంలో ఇతర హీరోలు కూడా చూపించారు కానీ కిరణ్ కేసు వేరు. వరుస డిజాస్టర్ల తర్వాత మార్కెట్ బాగా తగ్గిపోయిన పరిస్థితిలో ఉన్నాడు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యాడు. నాగ చైతన్య అంతటి స్టారే పబ్లిక్ స్టేజి మీద కదిలిపోయాడంటే కిరణ్ పడిన స్ట్రగుల్ అలాంటిది. కానీ ‘క’ అతని మాటని తప్పనివ్వలేదు. నిలబడి చూపించింది.
నిజానికి ‘క’లో ఎక్స్ ట్రాడినరీ, గతంలో చూడని కంటెంట్ లేదు. ఆ మాటకొస్తే కొన్ని నెలల క్రితం ఇదే తరహా స్క్రీన్ ప్లేతో ఆరంభం అనే సినిమా వచ్చింది. మరీ లో బడ్జెట్ కావడంతో థియేటర్ జనాలు పట్టించుకోలేదు కానీ ఓటిటిలో వచ్చాక దానికీ ప్రశంసలు దక్కాయి. కానీ కిరణ్ పదే పదే నొక్కి చెప్పిన క్లైమాక్స్ ఘట్టం ‘క’కు ఆయువుపట్టుగా నిలిచింది. అప్పటిదాకా ఉన్న లోటుపాట్లు, ఆడియన్స్ ఫీలైన ల్యాగ్ అన్నింటిని మటుమాయం చేస్తూ ఒక విధమైన సంతృప్తితో బయటికి వెళ్లేలా చేసింది. ఇదే ‘క’ను విజయ తీరాలకు చేర్చిందన్నది వాస్తవం. మొదటి రోజు కంటే రెండు రోజు వసూళ్లు బాగా మెరుగయ్యాయి.
లక్కీ భాస్కర్, అమరన్, బఘీరా లాంటి టాలీవుడ్ పోటీతో పాటు సింగం అగైన్, భూల్ భులయ్యా 3 రూపంలో బాలీవుడ్ కాంపిటీషన్ ని సైతం చవిచూడాల్సి వచ్చిన ‘క’కు మొదటి రోజు సరిపడా థియేటర్లు దొరకలేదు. హైదరాబాద్ లో ఎంత డిమాండ్ ఉన్నా సరే రెండు వందల షోల లోపే ఉండటం టికెట్లు దొరకని పరిస్థితి తీసుకొచ్చింది. నిన్నటి నుంచి షోలు, స్క్రీన్లు పెంచడం గమనార్హం. సోమవారం వచ్చే లోగానే బ్రేక్ ఈవెన్ అవ్వొచ్చన్న బయ్యర్ల నమ్మకం నిజమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. దర్శక ద్వయం సుజిత్ – సందీప్ లకు పెద్ద నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్సుల కోసం కాల్స్ వస్తున్నాయట.