‘క’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం తనను ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళకు గట్టిగా క్లాస్ తీసుకోవడం ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. తనను టార్గెట్ చేయడమే కాక సినిమాల్లో డైలాగుల రూపంలో సెటైర్లు వేయడం తనను బాధించిందని, అంతగా నేనేం చేశానంటూ ఆవేదన వ్యక్తం చేయడం అభిమానులను కదిలించింది. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరలో ఉన్న ఒక సంస్థ ఆఫీస్ లో ఇదంతా జరుగుతోందని చెప్పడం ఎవరా అనే ప్రశ్నను రేకెత్తించింది. గత ఏడాది రిలీజైన ఒక కన్నడ డబ్బింగ్ చిత్రంలో కిరణ్ మీద కామెంట్ చేసిన ఒక సంభాషణ ఉంది. తను చెప్పింది దాని గురించేనని ఫ్యాన్స్ కామెంట్.
గతంలో మంచు విష్ణు సైతం ఇదే తరహాలో సోషల్ మీడియా ట్రోలింగ్ కు గురవ్వడం పట్ల ఎంత ఇబ్బంది పడ్డాడో చూశాం. అలాని ఊరుకోలేదు. గట్టి పోరాటం చేసి కావాలని దుశ్చర్యకు పాల్పడిన యూట్యూబ్ ఛానల్స్ మీద చర్యలు తీసుకోవడం ద్వారా ఫలితం వచ్చేలా చూసుకున్నాడు. కోర్టుని ఆశ్రయించి ట్రోల్ వీడియోస్ తీయించేలా పోరాడాడు. ఇలా అందరికీ సాధ్యం కాదు. సమయాభావం, ఆర్థిక మద్దతు ఇలా రకరకాల కారణాల వల్ల మౌనంగా ఉంటున్న హీరో హీరోయిన్లే ఎక్కువ. కొందరు వ్యక్తిగత ప్రతిష్ట కోసం పట్టించుకోని దాఖలాలు ఉన్నాయి. ఆచార్య, భోళా శంకర్ టైంలో చిరంజీవికీ ఈ బెడద తప్పలేదు.
చూస్తూ పోనిలే అని వదిలేయడానికి ఇవి చిన్న వ్యవహారాలుగా ఉండటం లేదు. క్రమంగా విస్తరిస్తూ ఒక మాఫియాగా తయారవుతున్నాయి. ఎంతగా అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి ట్రోలింగ్స్ మీదే బ్రతుకుతూ మిలియన్ల వ్యూస్ తో ఆదాయానికి మరిగేంత. నిజంగా తప్పొప్పులను ఎంచడంలో అభ్యంతరం ఉండదు కానీ కేవలం వెటకారం కోసమే సినిమాలని వాడుకోవడం ముమ్మాటికీ తప్పే. ఇకనైనా ఒక్కొక్కరుగా ఈ ట్రోలింగ్ మహమ్మారి మీద గళం విప్పితే క్రమంగా దీన్ని కట్టడి చేయొచ్చు. తాము చేస్తోంది తప్పని ట్రోలర్స్ గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది.