మిర్జాపూర్ సినిమా ఖచ్చితంగా రిస్కే

ఇండియన్ ఓటిటిని మలుపు తిప్పిన వెబ్ సిరీస్ లలో మిర్జాపూర్ ది ప్రత్యేక స్థానం. హింస, అశ్లీలత, బూతు బోలెడంత ఉన్నప్పటికీ కథలోని డెప్త్ వల్ల కోట్లాది అభిమానులను సంపాదించుకుంది. అమెజాన్ ప్రైమ్ చందాదారులు అమాంతం పెరగడంలో దీని పాత్ర చాలా కీలకం. దానికి మూడింతల స్థాయిలో పైరసీలోనూ కోట్లాది అభిమానులు ఈ వయొలెంట్ డ్రామాని ఎంజాయ్ చేశారు. ఫస్ట్ సీజన్ స్థాయి కన్నా కొంచెం తక్కువే అయినప్పటికీ రెండో సిరీస్ కూడా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇటీవలే వచ్చిన మూడో సీజన్ అంచనాలు అందుకోలేక యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. అయినా సరే కొనసాగిస్తున్నారు.

సరే ఇంత సక్సెస్ కావడం వరకు బాగానే ఉంది కానీ మిర్జాపూర్ ని ఏకంగా సినిమాగా తీయాలని ప్రైమ్ నిర్ణయించుకోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే టీవీ, మొబైల్, లాప్ టాప్స్ లో చూసి చూసి అరిగిపోయిన కథని మళ్ళీ చూసేందుకు జనం ఆసక్తి చూపిస్తారా అనే సందేహం అందరికీ కలుగుతోంది. అయితే పూర్తిగా కొత్త స్టోరీతో వేరే ట్రీట్ మెంట్ తో తీస్తామని మేకర్స్ అంటున్నారు. ఇదెంత వరకు నిజమో కానీ విడుదల మాత్రం ఇప్పట్లో లేదు. 2026లో వస్తుందట. అంటే రెండేళ్లు నిర్మాణం చేయబోతున్నారంటే గట్టిగానే ప్లాన్ చేస్తున్నారన్న మాట.

ఒకవేళ ఈ ప్రయోగం కనక సక్సెస్ అయితే ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992 లాంటివి కూడా తెరకెక్కే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మన దేశంలో ఇలా వెబ్ సిరీస్ ని సినిమాగా ప్లాన్ చేసుకున్న ఘనత మిర్జాపూర్ కే దక్కుతోంది. ఒక ఊరి మాఫియా సామ్రాజ్యం మీద కన్నేసిన పలువురు వ్యక్తుల మధ్య జరిగే ఆధిపత్య పోరాటం చుట్టూ తిరిగే ఈ సిరీస్ ని కేవలం రెండు మూడు గంటల నిడివికి ఎలా కుదిస్తారనేది ఆసక్తికరంగా మారింది. టీజర్ లో మాత్రం చనిపోయిన పాత్రలు మళ్ళీ బ్రతికిస్తున్న హింట్ ఇచ్చారంటే మార్పులు గట్టిగానే ఉండబోతున్నాయి. ఏ మాత్రం తేడా కొట్టినా మిర్జాపూర్ బ్రాండ్ కే ప్రమాదం.