‘మీ టూ’ ఉద్యమం మొదలయ్యాక ఎంతోమంది నటీమణులు తమకు ఎదురైన లైంగిక వేధింపులు, చేదు అనుభవాల గురించి ఓపెన్ అయ్యారు. గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురైనా బయటికి చెప్పేవాళ్లు కాదు.
కానీ ‘మీ టూ’ పుణ్యమా అని ఎంతోమంది ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. కొందరేమో వేధించిన వారి మీద ఫిర్యాదు చేయకపోయినా తాము అనుభవించిన బాధ గురించి మాత్రం బయటపెడుతున్నారు. ‘చిన్నారి పెళ్ళికూతురు’ సీరియల్‌తో బాల నటిగా మంచి పేరు సంపాదించి.. ఆపై టాలీవుడ్లో ‘ఉయ్యాల జంపాల’ మూవీతో కథానాయికగా హిట్టు కొట్టి ఇక్కడ చాలా సినిమాలు చేసిన అవికా గోర్ కూడా తాజాగా తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఓపెన్ అయింది. తన రక్షణ కోసం నియమించుకున్న బాడీ గార్డే తనను లైంగికంగా వేధించడాని ఆమె వెల్లడించింది.
‘‘గతంలో నేను ఒక బాడీ గార్డును నియమించుకున్నా. కానీ నన్ను రక్షించాల్సిన వ్యక్తే నాతో అనుచితంగా ప్రవర్తించాడు. ఓ ఈవెంట్లో అతను నన్ను అసభ్యకరంగా తాకాడు. నేను అతడి వైపు సీరియస్‌గా చూసి ఏంటి అని అడగ్గా.. వెంటనే అతను నాకు సారీ చెప్పాడు. దీంతో ఆ సంఘటనను అక్కడితో వదిలేశాను. కానీ తర్వాత కూడా అతను అలాగే ప్రవర్తించాడు. ఆ సమయంలో అతణ్ని కొట్టే ధైర్యం ఉంటే బాగుండేది. తనతో పాటు చాలామందిని కొట్టేదాన్ని. ఐతే ఇప్పుడు నాకు ఆ ధైర్యం ఉంది. ఎవరైనా నాతో అలా ప్రవర్తిస్తే కచ్చితంగా కొడతా’’ అని అవికా గోర్ చెప్పింది.
ఒక దశలో కొంచెం బొద్దుగా తయారై సినిమా అవకాశాలు కోల్పోయి ఖాళీ అయిపోయిన అవికా.. తర్వాత బరువు తగ్గి నాజూగ్గా తయారై రీఎంట్రీ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఆమెకు బాగానే అవకాశాలు వస్తున్నాయి. తాను ప్రేమించిన వ్యక్తితో అవికా ఎంగేజ్ అయిన సంగతి తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates