పెళ్లిచూపులు రీమేక్.. అప్పుడు క్యాన్సిల్.. ఇప్పుడిలా

నాలుగేళ్ల కిందట తెలుగులో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది ‘పెళ్ళిచూపులు’. దాన్ని తెలుగు సినిమా దశను మార్చిన ట్రెండ్ సెట్టింగ్ సినిమాల్లో ఒకటిగా చెప్పొచ్చు. ఈ చిత్రంతోనే విజయ్ దేవరకొండ హీరోగా మారి మంచి పేరు సంపాదించాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ పేరు మార్మోగేలా చేసిన సినిమా ఇది. ఈ చిత్రం ఇతర భాషల వాళ్లనూ మెప్పించింది.

హిందీ, తమిళ భాషల్లో రీమేక్ కోసం ఎప్పుడో హక్కులు కొన్నారు. హిందీలో ఆల్రెడీ ఈ చిత్రం రీమేక్ అయింది కూడా. తమిళ రీమేక్ మూడేళ్ల కిందటే తెరకెక్కాల్సింది. విష్ణు విశాల్, తమన్నా జంటగా ఈ సినిమాను మొదలుపెట్టారు కూడా. కానీ ఎందుకో ఆ సినిమా ముందుకు కదల్లేదు. క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత ‘పెళ్ళిచూపులు’ రీమేక్ గురించి అందరూ మరిచిపోయారు.

ఐతే ఇప్పుడు ఉన్నట్లుండి మళ్లీ ‘పెళ్ళిచూపులు’ రీమేక్ తెరపైకి వచ్చింది. కొత్త కాంబినేషన్లో ఈ సినిమా మొదలైంది. ‘జెర్సీ’ సినిమాలో నాని కొడుకు పాత్రలో కనిపించిన హరీష్ కళ్యాణ్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. కథానాయికగా మారిన ఒకప్పటి టెలివిజన్ న్యూస్ ప్రెజెంటర్ ప్రియ భవానీ శంకర్ ఇందులో కథానాయిక. ‘ఓ మనప్పెన్నే’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కార్తీక్ సుందర్ అనే దర్శకుడు రూపొందించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ‘పెళ్ళిచూపులు’ హీరో అయిన విజయ్ దేవరకొండనే రిలీజ్ చేయడం విశేషం.

ఇక ఈ సినిమాకు సంబంధించి మరో విశేషం ఏంటంటే.. దీన్ని నిర్మిస్తున్నది తెలుగు నిర్మాతే. గత ఏడాది తమిళ హిట్ ‘రాక్షసన్’ను ‘రాక్షసుడు’ పేరుతో తెలుగులో నిర్మించిన కోనేరు సత్యనారాయణ.. ‘పెళ్ళిచూపులు’ రీమేక్‌తో తమిళంలోకి అడుగుపెడుతున్నారు. మరి తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం తమిళంలో ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.