గత మూడు సీజన్లలో అన్ స్టాపబుల్ షో కోసం రామ్ చరణ్ వస్తాడేమోనని ఫ్యాన్స్ తెగ ఎదురు చూశారు కానీ జరగలేదు. ప్రభాస్ ఎపిసోడ్ లో ఫోన్ లో ఆప్యాయంగా మాట్లాడుకోవడం చూసి మురిసిపోయిన ప్రేక్షకులు సైతం ఈ కాంబోని కోరుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలో, బయట ప్రైవేట్ ఈవెంట్స్ లో బాలయ్య, చరణ్ ఎదురుపడినప్పుడు ఇద్దరి మధ్య జరిగే కెమిస్ట్రీ వీడియోల రూపంలో తెగ వైరల్ అయ్యింది. సో సహజంగానే ర్యాపొ ఎక్కువ ఉందనేది అర్థమవుతుంది. ఆ క్షణం రానే వచ్చింది. బాక్సాఫీస్ బొనాంజా, మెగా పవర్ స్టార్ కలిసి పంచుకునే కబుర్ల కోసం రంగం సిద్ధమవుతోందని సమాచారం.
షూటింగ్ ఎప్పుడనేది చెప్పలేదు కానీ త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నారు. జనవరి 10 గేమ్ చేంజర్ విడుదల కానున్న నేపథ్యంలో దాని ప్రమోషన్లకూ ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సరైన టైంలో ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే సినిమా గురించి పక్కనపెడితే చరణ్ నుంచి బాలయ్య ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాబడతారోననేది ఆసక్తికరంగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం కం బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి, నాన్న చిరంజీవితో బాలకృష్ణకు ఉన్న అనుబంధం, రెండు కుటుంబాల మధ్య స్నేహం, కొత్త సినిమా కబుర్లు లాంటి బోలెడు విషయాలు ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావనకు రాబోతున్నాయి.
నవంబర్ లో వచ్చే అవకాశాలున్న ఈ స్పెషల్ ఎపిసోడ్ కు భారీ వ్యూస్ వస్తాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. మాములుగానే తక్కువ మాట్లాడే చరణ్ అంత సీనియర్ బాలయ్య ముందు ఏ మేరకు ఓపెనవుతాడో చూడాలి. ఒకడే వస్తాడా లేక గేమ్ ఛేంజర్ బృందంలోని కీలక సభ్యులు కూడా హాజరవుతారానేది ఇంకా నిర్ధారణకు రాలేదు. నాలుగో సీజన్ లో ఎప్పుడూ చూడనంత కంటెంట్ ఉంటుందని టీమ్ మొదటినుంచి ఊరిస్తోంది. దానికి తగ్గట్టే నారా చంద్రబాబాబునాయుడు, దుల్కర్ సల్మాన్, సూర్య, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇలా మంచి క్వాలిటీ లిస్టునే సిద్ధం చేసుకుని అలరించబోతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates