20 రోజుల గ్యాప్ – దేవి డబుల్ బొనాంజా

ఇప్పుడున్న ట్రెండ్ లో ఒక సంగీత దర్శకుడి ప్యాన్ ఇండియా మూవీ మూడు నెలలకు ఒకటి విడుదల కావడమే గగనమైపోయింది. అలాంటిది కేవలం ఇరవై రోజుల వ్యవధిలో రెండు అతి పెద్ద క్రేజీ సినిమాలు రిలీజంటే ఎవరికైనా అది ప్రత్యేకంగా నిలిచిపోతుంది.

దేవిశ్రీ ప్రసాద్ ఆ ఘనతను అందుకోబోతున్నాడు. నవంబర్ 14 రాబోతున్న కంగువకి ఏకంగా కోలీవుడ్ బాహుబలి రేంజ్ లో అంచనాలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. సూర్యతో పాటు టీమ్ మొత్తం చూపిస్తున్న కాన్ఫిడెన్స్ పక్కనపెడితే ఆరవ డిస్ట్రిబ్యూటర్లు ఎప్పుడూ చూడని అతి పెద్ద నెంబర్లు నమోదు కావడం ఖాయమని అంటున్నారు.

తమిళంలో ఇప్పటిదాకా బోలెడు ఆల్బమ్స్ కంపోజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ కు అవన్నీ ఒక ఎత్తు అయితే కంగువ మాత్రం ఇంకోవైపు నిలుస్తుంది. ఇది కనక బ్లాక్ బస్టర్ హిట్ అయితే తన పేరు మరోసారి జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోతుంది.

అనిరుధ్ రవిచందర్ రాజ్యమేలుతున్న గడ్డ మీద ముద్ర వేయడానికి దేవికి ఇంతకన్నా ఛాన్స్ దొరకదు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో నమ్మకం నిలబెట్టుకుంటే చాలు. ఇక డిసెంబర్ 5 పుష్ప 2 ది రూల్ దిగేస్తాడు. వెయ్యి కోట్లకు పైగా టోటల్ బిజినెస్ తో ఇప్పటికే అల్లు అర్జున్ రేపుతున్న ప్రకంపనలు ఇండియా వైడ్ హాట్ టాపిక్ గా మారాయి.

కంగువ, పుష్ప 2 రెండు కనక విజయవంతమైతే దేవి బ్యాక్ టు ట్రాక్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. తమన్ హవాలో కొంచెం వెనుకబడినట్టు అనిపించినా తనదైన రోజు చెలరేగిపోయే ఈ మిస్టర్ బ్యాచిలర్ కు వచ్చే ఏడాది ఎలాగూ ఉస్తాద్ భగత్ సింగ్ లాంటి పెద్ద సినిమాలు చేతిలో ఉన్నాయి.

కాకపోతే అందరిలాగా వేగంగా వచ్చిన ఆఫర్లు ఒప్పుకోకుండా స్లోగా ఉన్న దేవి ఇకనైనా స్పీడ్ పెంచాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అది జరగాలంటే సూర్య, అల్లు అర్జున్ ను బీజీఎమ్, సాంగ్స్ తో ఎలివేట్ చేస్తే చాలు. పోలిక ప్రకారం చూసుకుంటే ఇప్పటిదాకా వచ్చిన పాటల్లో కంగువ కన్నా పుష్ప ఆడియోనే ఎక్కువ ఛార్ట్ బస్టరయ్యింది.