పోటీ ఉన్నా ‘పొట్టేల్’ వైపే చూపు

ఈ శుక్రవారం ఆరు కొత్త సినిమాలు విడుదల కాబోతున్నాయంటే సగటు ప్రేక్షకులు ఆశ్చర్యపోతారేమో కానీ ఇది నిజం. చిన్న చిత్రాలకు ఓపెనింగ్స్ రావడం దుర్లభంగా మారిన తరుణంలో ఇలా క్లాష్ లో రావడం వల్ల ఓపెనింగ్స్ దెబ్బ తింటాయని తెలిసినా నిర్మాతలకు వేరే ఆప్షన్ ఉండటం లేదు. పైగా ఓటిటి స్ట్రీమింగ్ ఒప్పందాలు, పెద్ద హీరోలతో పోటీ పడితే వచ్చే నష్టం ఎక్కువగా ఉండటం లాంటి కారణాల వల్ల రిస్క్ చేయడం మినహా మరో మార్గం కనిపిస్తే ఒట్టన్నట్టు పరిస్థితులు మారిపోయాయి. ఉన్నవాటిలో ప్రమోషన్ పరంగా ఆకట్టుకున్న వాటిలో ‘పొట్టేల్’ ముందు వరసలో నిలుస్తోంది.

గతంలో సవారి తీసిన సాహిత్ మొత్కూరి దర్శకత్వంలో రూపొందిన పొట్టేల్ మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు ఏర్పడ్డాయి. హీరో కన్నా ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ హైలైట్ అవుతూ మెల్లగా బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. యువచంద్ర, అనన్య నాగళ్ళ జంటగా నటించగా నలభై సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా దీన్ని రూపొందించారు. అదే రోజు ‘లగ్గం’ రానుంది. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించగా సాయిరోనక్, ప్రగ్య హీరో హీరోయిన్లు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అండదండలు అందించిన ‘నరుడి బ్రతుకు నటన’ ఇదే రోజు వస్తోంది.

ఇవి కాకుండా రోటి కపడా రొమాన్స్, సి202, ఎంత పని చేశావ్ చంటి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. టాక్ మీద ఆధారపడినవే ఇవన్నీ. హాలీవుడ్ మూవీ ‘వెనోమ్ ది లాస్ట్ డాన్స్’ మీద యూత్, పిల్లలో మంచి క్రేజ్ ఉంది కానీ ఏ మేరకు వసూళ్లు రాబడుతుందో చూడాలి. సో హైప్ కోణంలో చూసుకుంటే పొట్టేల్ మీదే ఆసక్తి వచ్చేలా ఉంది. ఎల్లుండి రెండు రోజుల ముందే హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్లు వేస్తున్నారు. అడ్వాన్స్ లోనే షోలు ఫుల్ అయిపోయాయి. టాక్ బాగా వస్తే మాత్రం రెండో వారంకి థియేటర్లు నిలబెట్టుకోవడంతో పాటు దీపావళికి కొత్త రిలీజులు వచ్చేనాటికి బ్రేక్ ఈవెన్ అయిపోవచ్చు.