విశాల్ సినిమా ఓటీటీ రిలీజ్‌కు లైన్ క్లియర్

దక్షిణాదిన పేరున్న హీరోలు చాలామంది ఓటీటీ రిలీజ్ విషయంలో తీవ్ర వ్యతిరేకతతో ఉన్న సమయంలో తన చిత్రాన్ని ఆ మార్గంలో రిలీజ్ చేయడానికి ముందుకొచ్చిన హీరోల్లో విశాల్ ఒకడు. తాను హీరోగా స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘చక్ర’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి మూణ్నెల్ల ముందే అతను ఒప్పందం చేసుకున్నాడు.

జీ5 ఆ సినిమా హక్కుల్ని సొంతం చేసుకుంది. ట్రైలర్ కూడా లాంచ్ చేసి ఇక సినిమా విడుదల దగ్గర పడిందన్న సంకేతాలు కూడా ఇచ్చాడు విశాల్. కానీ ఇంతలో అతడికి అనుకోని అవాంతరం వచ్చి పడింది. విశాల్ చివరి సినిమా ‘యాక్షన్’ను భారీ బడ్జెట్లో నిర్మించి.. సినిమా ఆశించిన ఫలితం అందుకోకపోవడంతో బాగా నష్టపోయిన రవీంద్రన్ అనే నిర్మాత ‘చక్ర’ విడుదలపై స్టే ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించడంతో ఈ సినిమాకు బ్రేక్ పడింది.

‘యాక్షన్’ సినిమాకు సంబంధించి విశాల్ తనకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రవీంద్రన్ ‘చక్ర’ విడుదలపై స్టే కోరాడు. కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ పరిహారం అందించే విషయంలో విశాల్ ఏం చేశాడన్నది వెల్లడి కాలేదు. ఇష్యూ సెటిలైనట్లు అయితే కనిపించలేదు. ఐతే తాజాగా కోర్టు.. ‘చక్ర’ విడుదలపై స్టేను కొనసాగించలేమంటూ తీర్పు ఇచ్చింది. దీంతో ఆ సినిమా రిలీజ్‌కు లైన్ క్లియర్ అయింది. ఈ చిత్రాన్ని వచ్చే నెలలో దీపావళి కానుకగా విడుదల చేయాలని విశాల్ చూస్తున్నాడు.

దసరా టైంలో సూర్య చిత్రం ‘సూరారై పొట్రు’ (ఆకాశమే నీ హద్దురా) విడుదలవుతున్న నేపథ్యంలో ఆ తర్వాత దీపావళి పండక్కి తన సినిమాను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆనందన్ అనే దర్శకుడు రూపొందించిన ఈ చిత్రాన్ని విశాల్ హిట్ మూవీ ‘ఇరుంబు తిరై‘ (అభిమన్యుడు)కు సీక్వెల్‌‌గా భావిస్తున్నారు. ‘చక్ర’ను తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేయనున్నారు.