నిన్న సాయంత్రం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లైవ్ మ్యూజికల్ కన్సర్ట్ ఘనంగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు, ప్రముఖులు, మీడియా ప్రతినిధులతో ప్రాంగణం కళకళలాడిపోయింది.
దేవి మొదటిసారి భాగ్యనగరంలో చేసిన ఈవెంట్ కావడంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రమోషన్లు చేశారు. టికెట్లు భారీగా అమ్ముడుపోయాయి. స్పాన్సర్లు పెద్ద ఎత్తున ముందుకొచ్చి గ్రాండియర్ తీసుకొచ్చేందుకు దోహదపడ్డారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగింది. అయితే కొందరు హీరోల ఫ్యాన్స్ నుంచి అసంతృప్తి గళం వినిపించడం మొదలైంది.
కారణం ఏంటయ్యా అంటే దేవి పాడిన పాటల్లో మహేష్ బాబువి వాడకపోవడం పట్ల అభిమానులు బహిరంగంగానే సోషల్ మీడియాలో కామెంట్స్, ట్రోల్స్ చేస్తున్నారు. మెగా పాటలే ఎక్కువగా ఉన్నాయని కనీసం 1 నేనొక్కడినేలో హూ ఆర్ యుని సైతం పాడలేదని ఆరోపిస్తూ ట్వీట్లు వేయడం మొదలుపెట్టారు.
ఎంతసేపూ శంకర్ దాదా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, పుష్ప, రంగస్థలం అంటూ మెగా సాంగ్స్ కి ప్రాధాన్యం ఇవ్వడం తప్ప ఇంకేం చేయలేదని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి దేవి కంపోజ్ చేసిన సుమారు 105 సినిమాల్లో ఇరవై ఆరు దాకా మెగా ఫ్యామిలీవే ఉండటం కాకతాళీయం.
అంతమాత్రాన ఉద్దేశపూర్వకంగా చేసినట్టు కాదని దేవి ఫ్యాన్స్ అంటున్నారు. ఏది ఏమైనా ఆన్ లైన్ ఫ్యాన్ వార్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. మరీ ప్రైవేట్ ఈవెంట్స్ గురించి కూడా ఈ స్థాయిలో చర్చ చేసుకోవడం చూస్తే ప్రతిదీ ఎంత పర్సనల్ గా తీసుకున్నారో అర్థమవుతుంది.
గతంలో ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ లాంటి లెజెండ్స్ ఇదే చోట లైవ్ ప్రోగ్రాంస్ ఇచ్చారు. అప్పుడు ఏ సమస్యా, పోలిక రాలేదు. కానీ దేవికి మాత్రం ఇలా టార్గెట్ చేయడం సబబు కాదనేది ఒక అభిప్రాయం. వీటిని చూస్తూ ఎవరి విచక్షణకు వాళ్ళను వదిలేయడం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏముంది.