ఇటీవలే విడుదలైన ప్యాన్ ఇండియా మూవీ మార్టిన్ ఫలితం తెలిసిందే. నిర్మాతలు దీన్ని ఫ్లాప్ అంటే ఒప్పుకోవడం లేదు. సరే వసూళ్లు చూపించో లేదా కలెక్షన్లను పోస్టర్లలో వేయడం ద్వారానో దాన్ని సమర్ధించుకోవచ్చు కానీ సినిమా బాలేదన్నా కూడా నో అనడం అసలు ట్విస్టు. ఇటీవలే కొందరు యూట్యూబర్లు మార్టిన్ ని రివ్యూ చేస్తూ అందులోనూ తప్పులను తీవ్రంగా ఎత్తి చూపారు. ఇందులో కొన్ని భారీ రీచ్ ఉన్న ఛానల్స్ ఉన్నాయి. దీంతో వాళ్లకు కాపీ రైట్ స్ట్రైక్ నోటీస్ పంపించడమే కాక కొందరికి ఏకంగా కోర్టు ఆర్డర్లు అందడంతో ఒక్కసారిగా షాక్ కావడం పాడ్ కాస్టర్ల వంతయ్యింది.
నిజానికి మార్టిన్ కు ఎలాంటి యునానిమస్ పాజిటివ్ టాక్ రాలేదు. రివ్యూలు దాదాపుగా నెగటివ్ గానే ఉన్నాయి. కాకపోతే ఆన్ లైన్ విశ్లేషణలు చేసే వాళ్ళు కొంచెం ఘాటుగా మాట్లాడతారు కాబట్టి వాటి వల్ల వచ్చే ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. దీని పట్ల నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామానికి స్పందనగా యుట్యూబర్లు మాట్లాడుతూ హిట్టయినా ఫ్లాప్ అయినా హుందాగా ఒప్పుకోవడమే ఫిలిం మేకర్ లక్షణమని, అంతే తప్ప ఇలా రైటా రాంగా చెప్పిన వాళ్ళను టార్గెట్ చేయడం ఏమిటని నిలదీస్తున్నారు. రాజ్ కుమార్, రవిచంద్రన్ లాంటి స్టార్లు ఏనాడూ ఇలా చేయలేదన్నారు.
మొత్తానికి మార్టిన్ చిచ్చు యూట్యూబ్ లో గట్టిగానే పేలింది. ఆ మధ్య మలయాళంలో కొన్ని సినిమాలకు ఇలాగే చేశారు కానీ ఫలితం దక్కలేదు. పదే పదే కోర్టులు ఇలాంటి కేసులను తీసుకోవడానికి సుముఖత చూపించవు. టికెట్ కొని చూసినప్పుడు ఎవరికైనా తమ అభిప్రాయాలను ఏ రూపంలో అయినా చెప్పే హక్కు రాజ్యాంగం ఇస్తుందని, అలాంటప్పుడు దీన్ని తప్పని ఎలా అంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కెజిఎఫ్ ప్రభావం వల్ల అలాంటి ప్యాన్ ఇండియా మూవీసే తీయాలని ప్రయత్నిస్తున్న కొందరు శాండల్ వుడ్ దర్శకులకు బాక్సాఫీస్ సానుకూల ఫలితం ఇవ్వలేదన్నది వాస్తవం.