చిన్న సినిమాల కోసం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం పెద్ద సవాల్. ఎన్ని ప్రమోషన్లు చేసినా స్టార్ క్యాస్టింగ్ లేనప్పుడు వాటి వైపు చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించరు. ఎక్స్ ట్రాడినరి టాక్ వస్తే తప్ప వసూళ్లు కనిపించవు. బలగం లాంటి వాటిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దానికి దిల్ రాజు లాంటి బడా నిర్మాత ఉన్నారు కాబట్టి మంచి కంటెంట్ త్వరగా రీచ్ అయ్యేందుకు ఉపయోగపడింది. అన్నింటికి ఇలాంటి సౌలభ్యం ఉండదు కనక బలంగా మార్కెటింగ్ చేసుకోవాలి. ఒకరికొకరు చేయూతగా నిలవాలి. ఈ విషయంలో కిరణ్ అబ్బవరం ఒక అడుగు ముందు వేశాడు.
ఈ రోజు విడుదలైన లవ్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు కావడమే కాక దానికి చేయూత అందిస్తాననే మాటను నిలబెట్టుకుంటూ హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, విజయవాడలో నాలుగు థియేటర్లలో ఉచిత షోలు స్పాన్సర్ చేశాడు. ఎవరు ముందుగా వెళ్తే వాళ్లకు ఫ్రీ టికెట్లు తరహాలో ఓపెన్ వాకిన్ ఇన్ ప్రకటించారు. జిపిఆర్ మల్టీప్లెక్సుకు మాత్రం ఒక ఫోన్ నెంబర్ ద్వారా ఉచిత టికెట్ ఇచ్చే ఏర్పాట్లు చేశారు. నిన్న సాయంత్రం రెండు ప్రీమియర్ షోలు కేవలం యాభై రూపాయలకు చూసేలా నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇవన్నీ ప్రత్యేకంగా యూత్ ని ఆకట్టుకోవడానికి బాగా ఉపయోగపడతాయి.
గతంలోనూ కొన్ని సినిమాలకు ఇలాంటి ఉచిత ప్రదర్శనలు ఏర్పాటు చేయడం రైటర్ పద్మభూషణ్ లాంటి వాటికి బాగా ఉపయోగపడింది. లవ్ రెడ్డి ఎలా ఉందనే సంగతి తర్వాత తేలుతుంది కానీ ముందైతే మొదటి రోజు హౌస్ ఫుల్స్ చేయించడం ద్వారా టాక్ ఎక్కువ మోతాదులో బయటికి వెళ్తుంది. నెగటివ్ ఉంటే బ్యాడ్ లక్ అనుకోవచ్చు. పాజిటివ్ వస్తే మెల్లగా వసూళ్లు పెరగడానికి ఇదే దోహదపడుతుంది. లేదంటే అసలు వచ్చిన విషయమే పబ్లిక్ కి తెలిసే లోపు థియేటర్ల నుంచి మాయమయ్యే ప్రమాదముంది. కిరణ్ అబ్బవరం ఐడియాని ఇతరులు కూడా ఫాలో అయితే బాగుంటుంది.