నెగెటివిటీని జయించడానికి బన్నీ ప్లాన్

అల్లు అర్జున్ మీద ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా నెగెటివిటీ పెరిగిపోవడాన్ని గమనించే ఉంటారు. కెరీర్ ఆరంభంలో అతణ్ని నెత్తిన పెట్టుకుని మోసిన మెగా అభిమానులే తనకు వ్యతిరేకంగా తయారయ్యారు. అందుకు ప్రధాన కారణం ‘మెగా’ గొడుగు నుంచి పక్కకు వెళ్లి సొంత బ్రాండును పెంచుకోవడానికి ప్రయత్నించే క్రమంలో అతడి చర్యలు, మాటలు మెగా అభిమానులకు రుచించకపోవడమే.

అసలే బన్నీ విషయంలో మెగా అభిమానుల్లో ఓ వర్గం అసంతృప్తితో ఉంటే.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం చేసి ఆ అసంతృప్తిని ఇంకా పెంచాడు బన్నీ. వ్యక్తిగత స్నేహంతోనే తాను శిల్పా రవికి ప్రచారం చేశానని.. దీనికి రాజకీయాలకు సంబంధం లేదని బన్నీ వివరణ ఇచ్చుకున్నా కూడా మెగా ఫ్యాన్స్ శాంతించలేదు. అంతకంతకూ బన్నీ మీద వారిలో నెగెటివిటీ పెరిగిపోయింది.

ఇటీవల ఓ ఈవెంట్లో బన్నీ మాట్లాడుతూ నాకు నచ్చితే ఎక్కడికైనా వెళ్తా అంటూ చేసిన కామెంట్‌తో ఈ నెగెటివిటీ పీక్స్‌కు చేరుకుంది. ఈ ప్రభావం ‘పుష్ప-2’ మీద పడుతుందేమో అన్న చర్చ కూడా నడుస్తోంది. ‘పుష్ప-2’ వచ్చినపుడు మా పవర్ చూపిస్తాం అంటూ మెగా అభిమానులే వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

దీంతో ‘పుష్ప-2’ మేకర్స్‌లో కొంత ఆందోళన నెలకొంది. ఐతే ఇగో పక్కన పెట్టి ఈ నెగెటివిటీని తగ్గించాల్సిన అవసరాన్ని అల్లు అర్జున్ గుర్తించినట్లు సమాచారం. బన్నీ త్వరలో మొదలు కాబోతున్న ‘అన్‌స్టాపబుల్’ షోలో ఒక ఎపిసోడ్‌కు అతిథిగా రాబోతున్నాడట. అందులో తన పొలిటికల్ స్టాండ్ విషయంలో ఒక క్లారిటీ ఇస్తాడని.. వైసీపీకి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పబోతున్నాడని.. శిల్పా రవికి ప్రచారం చేయడం గురించి కూడా మాట్లాడతాడని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

బన్నీ కొంచెం తగ్గి మాట్లాడి ఈ వివాదానికి తెరదించే ప్రయత్నం చేయనున్నాడని.. తద్వారా ‘పుష్ప-2’ను మెగా అభిమానులు టార్గెట్ చేయకుండా చూడాలనుకుంటున్నాడని సమాచారం. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తన ప్రసంగంలో బన్నీ పేరు ప్రస్తావించడంతో మెగా అభిమానుల్లో అంతర్గత కలహాలకు తెరదించే దిశగా ప్రయత్నం జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది.