అమ్మ‌కానికి క‌ర‌ణ్ జోహార్ సంస్థ‌?

‘కుచ్ కుచ్ హోతా హై’ లాంటి పెద్ద బ్లాక్ బస్టర్‌తో దర్శకుడిగా పరిచయం అయిన కరణ్ జోహార్.. బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫిలి మేకర్స్‌లో ఒకడిగా ఎదిగాడు. దర్శకుడిగా చాలా వేగంగా పెద్ద స్థాయికి చేరుకోవడంతో నిర్మాణంలోకి కూడా అడుగు పెట్టేశాడు. ధర్మ ప్రొడక్షన్స్ బేనర్ మీద పెద్ద పెద్ద సినిమాలు తీశాడు.

అలాగే డిస్ట్రిబ్యూషన్లోకి కూడా అడుగు పెట్టాడు. పదుల సంఖ్యలో సినిమాలను నిర్మించి, డిస్ట్రిబ్యూట్ చేసి ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే బిగ్గెస్ట్ బేనర్లలో ఒకటిగా ‘ధర్మ ప్రొడక్షన్స్’ను నిలిపాడు. కానీ ఈ మధ్య కరణ్‌కు ఏదీ కలిసి రావడం లేదు. ప్రొడ్యూస్ చేసిన సినిమాలతో పాటు డిస్ట్రిబ్యూట్ చేసిన చిత్రాలు కూడా బోల్తా కొడుతున్నాయి.

కరోనా తర్వాత మొత్తంగా బాలీవుడ్ పరిస్థితే ఆశాజనకంగా లేకపోగా.. కరణ్ లాంటి మంచి సక్సెస్ రేట్ ఉన్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ కూడా నిలబడలేని పరిస్థితి తలెత్తింది. ఈ ఏడాది కరణ్ జోహార్ సంస్థ నుంచి వచ్చిన సినిమాలన్నీ నిరాశపరిచాయి.

లేటెస్ట్‌గా ‘జిగ్రా’ మూవీతో ఎదురు దెబ్బ తిన్నాడు కరణ్. ఆలియా భట్ ప్రధాన పాత్రలో వాసన్ బాల రూపొందించిన ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చినా.. దసరా పండుగ వాతావరణంలో ప్రేక్షకులు ఈ సీరియస్ మూవీని చూడ్డానికి ఇష్టపడలేదు. ఈ చిత్రం భారీగా నష్టాలు మిగిల్చింది.

కొన్నేళ్ల నుంచి సక్సెస్ రేట్ బాగా తగ్గిపోవడంతో కరణ్ సంస్థ ఇప్పుడు ఆర్థిక నష్టాలను తట్టుకోలేని స్థితికి చేరుకుంది. దీంతో ధర్మ ప్రొడక్షన్స్‌లో సగం వాటాను అమ్మేయడానికి కరణ్ జోహార్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముకేశ్ అంబానీ సంస్థ రిలయెన్స్ ‘ధర్మ ప్రొడక్సన్స్’లో వాటాను కొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముకేశ్ రంగంలోకి దిగారంటే నెమ్మదిగా ధర్మ ప్రొడక్షన్స్‌ మేజర్ వాటా ఆయన చేతుల్లోకి వెళ్లిపోవడం ఖాయం. అలా అని కరణ్ పూర్తిగా తన సంస్థను వదులుకోకపోవచ్చు. క్రియేటివ్ విషయాలన్నీ కరణ్ చూసుకుంటే.. ఆర్థిక వ్యవహారాలు రిలయన్స్ చేతుల్లోకి వెళ్లిపోతాయన్నమాట.