హడావిడి జీవనశైలి, స్ట్రెస్ కారణంగా ఆరోగ్యంపై తగిన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల చిన్న వయస్సులోనే అనేక వ్యాధులు వస్తున్నాయి. అయితే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే, సరైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు అనుసరించడం ముఖ్యం. పైగా ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఎన్నో ఇన్ఫెక్షన్ల కారణాలు తలెత్తుతున్న సమస్యలను చిన్న రెమెడీస్ తో ఇంటి వద్దనే సులభంగా అరికట్టవచ్చు. నల్ల మిరియాలు కలిపిన పాలను రాత్రి తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరిగి, శరీరం అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందుతుంది.
నల్ల మిరియాలు కలిపిన పాల ప్రయోజనాలు
1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది
నల్ల మిరియాల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని వైరస్‌లు, బ్యాక్టీరియాల ఇన్ఫెక్షన్‌ల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. రాత్రిపూట పాలలో నల్ల మిరియాల పొడి కలిపి తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.
2. దగ్గు, జలుబు నివారణ
ప్రస్తుతం కాలంతో సంబంధం లేకుండా తరచూ వచ్చే జలుబు, దగ్గు సమస్యలకు ఇది అద్భుతమైన పరిష్కారం. గోరువెచ్చని పాలలో నల్ల మిరియాలు కలిపి తాగితే గొంతు నొప్పి, శ్లేష్మం సమస్య తగ్గుతుంది. ఇది శరీరాన్ని వేడిగా ఉంచి, ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని బయటికి పంపుతుంది. మిరియాల పాలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తాగవచ్చు.
3. ఎముకలను బలపరుస్తుంది
పాలలో కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా పనిచేస్తుంది. దీనికి తోడు, నల్ల మిరియాల్లో ఉండే పోషకాలు ఈ ప్రయోజనాన్ని మరింతగా పెంచుతాయి. దీంతో ఎముకలు బలంగా ,దృఢంగా ఉంటాయి.
4. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది
నల్ల మిరియాలు జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి, ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా సహాయపడతాయి. రాత్రి నిద్రకు ముందు పాలలో నల్ల మిరియాలు కలిపి తాగడం వల్ల అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు శరీరంలో ఉన్న మలినాలను, విష పదార్థాలను తొలగించడంలో కూడా మిరియాలు ఎంతో ఉపయోగపడతాయి.
5. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది
శరీరంలో అదనపు కొవ్వును కరిగించడానికి నల్ల మిరియాలు సహాయపడతాయి. ఇవి జీవక్రియను వేగవంతం చేసి, చెడు కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. కాబట్టి బరువు తగ్గాలని భావిస్తున్నవారు ఈ మిశ్రమాన్ని తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు.
నల్ల మిరియాల పాలను ఎలా తయారు చేసుకోవాలి?
ఒక గ్లాసు పాలలో చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపి రెండు మూడు నిమిషాలు మరిగించాలి. దీనికి చిటికెడు పసుపు కలిపి కాస్త చల్లారనిచ్చి గోరువెచ్చగా తీసుకోవాలి. మిరియాల ఘాటు తట్టుకోలేము అనుకునేవారు ఈ పాలలో కాస్త తేనె లేక పంచదార కలుపుకోవచ్చు. అయితే, అలెర్జీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఈ పాలను తాగడం మంచిది.
గమనిక:
పై సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ లేదా న్యూట్రిషన్ ను సంప్రదించడం మంచిది.
Gulte Telugu Telugu Political and Movie News Updates