మన శరీరంలో కాలేయం ఎంతో ముఖ్యమైన భాగం. ఇది రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా, జీవక్రియను వేగవంతం చేయడం, ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైములు విడుదల చేయడం వంటి అనేక పనులు నిర్వహిస్తుంది. అయితే, కాలేయం పని తీరు పై ప్రభావం పడుతుంది అన్నప్పుడు శరీరం మనకు ముందుగానే సంకేతాలు ఇస్తుంది. వాటిని విస్మరించకుండా మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతాము..
ఆహారపు అలవాట్లు, స్ట్రెస్ కారణంగా చాలామంది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారంతో పాటు వ్యాయామం ,రెస్ట్ కూడా చాలా అవసరం. మనకు తెలియకుండా మన జీవనశైలి కారణంగా శరీరంలోని వివిధ ముఖ్యమైన అవయవాలపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది.. దీని ప్రభావం వాటి పనితీరుపై ఉంటుంది. కాలేయం సమస్య ఉన్నవారు కామన్ గా కనిపించే లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం..
పచ్చ కామెర్లు:
కళ్లు, చర్మం పచ్చగా మారితే ఇది కాలేయ సమస్యల సంకేతం. పచ్చ కామెర్లు రావడం కాలేయం పనితీరు సరిగ్గా లేకపోవడాన్ని సూచిస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.
వాపులు:
కాలేయం సరిగా పనిచేయకపోతే శరీరంలోని టాక్సిన్లు పేరుకుపోతాయి. ఈ ప్రభావంతో కాళ్లు, పాదాలు వాపులు ఎదుర్కొంటాయి. వాపు చోట్ల నొక్కితే చర్మం లోపలికి వెళ్ళడం వంటి లక్షణాలు ఉంటాయి. ఇది కాలేయ సమస్యకు సంకేతం కావచ్చు.
మూత్రం రంగు మారడం:
మూత్రం తరచూ పసుపు రంగులో కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. ఇది కాలేయం దెబ్బతిన్నప్పుడు కనిపించే ప్రధాన లక్షణాల్లో ఒకటి.
ఆకలి మందగించడం:
ఏమి తినాలనిపించకపోవడం, వికారం లేదా వాంతులు రావడం లాంటి సమస్యలు ఉంటే, ఇది కాలేయ సమస్యకు సంకేతం.
అలసట:
చిన్న పనులకు కూడా అలసిపోవడం, చేతి గోళ్లకు రంగు మారడం వంటి లక్షణాలు కూడా కాలేయ సమస్యలకు సంకేతాలు కావచ్చు.
కాలేయాన్ని కాపాడుకోవడానికి సూచనలు:
1. వ్యాయామం:
ప్రతిరోజూ 20-30 నిమిషాల నడక లేదా సైక్లింగ్, స్విమ్మింగ్, హైకింగ్ వంటి వ్యాయామాలు చేయండి. బ్రిస్క్ వాకింగ్ కాలేయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
2. ఆహార నియంత్రణ:
చక్కెర, సోడియం అధికంగా ఉన్న ఆహారాలను తగ్గించి, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి.
3. అలవాట్లు:
ధూమపానం, మద్యపానం వంటి హానికరమైన అలవాట్లను విడిచిపెట్టాలి.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు పై సూచనలు పాటించండి. పైన చెప్పిన లక్షణాలు ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించండి.
గమనిక:
పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీరు ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ లేదా న్యూట్రీషను సంప్రదించడం మంచిది.