ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయం మనందరికీ తెలుసు. ప్రస్తుతం ఎక్కడ చూసినా హెల్త్ పట్ల అవగాహన విపరీతంగా పెరుగుతుంది. చాలామంది తాజా కూరగాయలు, పండ్లు తినడానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారు. మన రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఉండటం శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. కూరగాయలలో బెండకాయను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో అధికంగా ఉండే పోషకాలు శరీరానికి అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి. అయితే, కొందరికి బెండకాయ తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బెండకాయ పోషక విలువలు:బెండకాయలో విటమిన్ కె, సి, ఫోలేట్, మెగ్నిషియం, విటమిన్ బి వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచడంతో పాటు ఇమ్యూనిటీని మెరుగుపరుస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా బెండకాయ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మెదడు పనితీరును మెరుగుపరచడం ద్వారా మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
బెండకాయ ఎవరు తినకూడదు :
బెండకాయలో ఉన్న అధిక ఫైబర్ కారణంగా కొందరికి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారు బెండకాయ తినడం మానుకోవడం మంచిది. అలాగే స్కిన్ అలెర్జీ, దద్దుర్లు, ర్యాషెస్ లేదా శ్వాసకోస సమస్యలతో బాధపడే వారికి బెండకాయలోని లెక్టిన్ ప్రోటీన్ ఇబ్బందిని మరింత తీవ్రతరం చేయవచ్చు. ఈ కారణంగా అలెర్జీ సమస్యలతో బాధపడేవారు బెండకాయను పూర్తిగా నివారించాలి.
బెండకాయలో కాల్షియం ఆక్సలేట్ అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్ల సమస్యను మరింత పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారు బెండకాయ తినడం నుండి విరమించుకోవడం మంచిది. అలాగే ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వారికి కూడా బెండకాయ ఎక్కువగా తినడం మంచిది కాదు.
ఇందులో పుష్కలంగా లభించే కాల్షియం ఆక్సలేట్ మోకాళ్లలో నొప్పి, వాపును కలిగిస్తుంది. మరి ముఖ్యంగా చలికాలంలో ఆర్థరైటి సమస్య ఉన్నవారు బెండకాయను ఎక్కువగా తినడం వల్ల విపరీతమైన కీళ్ల నొప్పులతో ఇబ్బందులు పడతారు. కాబట్టి మీకు పైన చెప్పిన లక్షణాల్లో ఏది ఉన్నా సరే బెండకాయకి కాస్త దూరంగా ఉండడం మంచిది.
గమనిక:
ఇది సాధారణ సమాచారం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితి మేరకు ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం, సరైన ఆహారం తీసుకోవడం మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.