చలికాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే…

చలికాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీనికి ముఖ్య కారణం ఈ సీజన్లో మన శరీరంలో తగ్గిపోయే ఇమ్యూనిటీ అనడంలో డౌట్ లేదు. మరి ముఖ్యంగా ఈ సీజన్లో జలుబు, దగ్గు వంటి సమస్యలు పిల్లల నుంచి పెద్దల వరకు సులభంగా వస్తాయి. అయితే మన శరీరంలో విటమిన్ డి లెవెల్స్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయగలిగితే ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు.

విటమిన్ డి సహజంగా సూర్యరస్మి నుంచి మన శరీరం గ్రహించుకుంటుంది. అయితే చలికాలంలో మన శరీరానికి అవసరమైన విటమిన్ డి సూర్యరస్మి నుంచి అందడం తగ్గుతుంది. కానీ దీన్ని మనం కొన్ని ఆహార పదార్థాలని తీసుకోవడం వల్ల బ్యాలెన్స్ చేయవచ్చు. మరి చలికాలంలో మనకు కావలసిన విటమిన్ డి అందించే ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం పదండి..

నువ్వులు:

నువ్వులు మన శరీరంలోని వేడిని పెంచడంతోపాటు శరీరానికి అవసరమైన విటమిన్ డి, క్యాల్షియంను పుష్కలంగా అందిస్తాయి. ఇవి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎముకలు, కీళ్లు బలంగా మారుతాయి. నువ్వులను మీరు పచ్చళ్ళు, స్వీట్స్, సలాడ్స్ లో కూడా వేసుకొని తినవచ్చు. దీనివల్ల చాలామందికి రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. అయితే కొంతమందికి నువ్వులు సరిపడావు.. అలాంటివారు వీటికి దూరంగా ఉండడం మంచిది.

మష్రూమ్స్:

ఇప్పుడు మార్కెట్లో మనకు బటన్ మష్రూమ్స్, ఆయిస్టర్ మష్రూమ్స్.. ఇలా ఎన్నో వెరైటీస్ సులభంగా లభ్యమవుతున్నాయి. మష్రూమ్స్ రెగ్యులర్ గా తినడం వల్ల మన శరీరంలో విటమిన్ డి లెవెల్స్ బాగా పెరుగుతాయి. కాబట్టి రెగ్యులర్ గా మీరు మష్రూమ్స్ ని మీ డైట్ లో భాగంగా మార్చుకోవచ్చు.

ఉసిరికాయ:

ఈ సీజన్ విరివిగా దొరికే ఉసిరి మన శరీరానికి అవసరమైన విటమిన్ సి ని అందించడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ ఫ్రూట్ తినడం వల్ల ఈ సీజన్లో ఇన్ఫెక్షన్ కారణంగా సోకే జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఉసిరికాయతో పులిహోర, పచ్చడి, మురబ్బా వంటివి చేసుకొని తినవచ్చు. మీరు తాగే జ్యూస్, స్మూతీస్, సూప్స్ లో కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు.

స్వీట్ పొటాటో:

ఈ సీజన్లో చిలగడ దుంపలు అదేనండి స్వీట్ పొటాటోస్ బాగా దొరుకుతాయి. ఈ దుంపలు తినడం వల్ల చలికాలంలో చాలామందిని సతాయించే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే స్వీట్ పొటాటోస్ ని మీ డైట్ లో భాగంగా చేసుకుంటే బరువు కూడా తగ్గుతారు.

గమనిక: ఈ వివరాలను ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం అందించాం. ఈ కథనం కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమే. మీరు వీటిని పాటించే ముందు మీ డాక్టర్ లేక డైటీషియన్ సంప్రదించడం మంచిది.