తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర పరిణామం ఒకటి తెరమీదకు వచ్చింది. మేథావిగా ముద్రపడ్డ మాజీ ఐఏఎస్ అధికారి, ఓ దఫా ఎమ్మెల్యేగా సేవలు అందించిన లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గురించి ఈ వార్త. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ తమ్ముడు నాగేంద్రబాబు తాజాగా బీజేపీ కండువా కప్పుకొన్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఈ మేరకు బీజేపీ కండువాను నాగేంద్రబాబు మెడలో వేశారు. దీంతో తర్వాత చేరబోయేది జేపీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
గత కొద్దికాలంగా దేశంలోని మేధావి వర్గం, బుద్ధిజీవులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనను, బీజేపీ విధానాలను నిశితంగా విమర్శిస్తున్నాయి. ఇదే సమయంలో కొందరు మోడీ చర్యలను సమర్థిస్తున్నారు. ఇందులో తెలుగు నేలకు చెందిన వారున్నారు. అలాంటి వారిలో జేపీ ఒకరు అనే టాక్ ఆయన వివిధ ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో భాగస్వామ్యం పంచుకుంటున్న సమయంలో వ్యక్తమవుతోంది. అయితే, ఈ చర్చపై ఇటు బీజేఏపీ తరఫున కానీ అటు లోక్సత్తా జేపీ తరఫున కానీ ఎలాంటి స్పందన/ ప్రకటన వెలువడలేదు.
ఇదిలాఉంటే, తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీకి చెందిన పార్లమెంటరీ బోర్డు సభ్యుడైన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ చేతుల మీదుగా లోక్సత్తా జేపీ సోదరుడు నాగేంద్రబాబు కాషాయ కండువాను కప్పుకొన్నారు. ఆయనతో పాటుగా పలువురు భావసారుప్య వ్యక్తులు సైతం ఈ మేరకు పార్టీలో చేరారు. ఈ విషయాన్ని బీజేపీ వెల్లడించిన వెంటనే, సోషల్ మీడియాలో కామెంట్లు మొదలయ్యాయి. త్వరలో చేరబోయేది జేపీనే, ఇప్పటికే ఆయన ఈ మేరకు మొగ్గుచూపుతున్న విషయం అర్థమవుతోంది అంటూ పేర్కొంటున్నారు. ఈ విషయంలో నిజం తెలియాలంటే, మనం కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates