టీడీపీ పుంజుకొంటోందని ఆ పార్టీ నేతలంతా బలంగా నమ్ముతున్న సమయంలో కీలక నేత ఒకరు ఆ పార్టీని వీడడం సంచలనంగా మారింది. ఎమ్మెల్సీ పదవి హామీ కైకలూరు టీడీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ వైసీపీలో చేరారు. టీడీపీలో తనకు టికెట్ రాదేమోనన్న అనుమానంతో ఉన్న ఆయనకు వైసీపీలో ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేయడంతో వెంటనే పార్టీ ఫిరాయించినట్లు తెలుస్తోంది. పార్టీ కీలక నేత నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభించి వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్న తరుణంలో ఇలా ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ మారడం ఎదురుదెబ్బే.
జడ్పీటీసీ నుంచి ఒక్కసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన జయమంగళ వెంకట రమణ రాజకీయ జీవితం ఆ తరువాత దెబ్బతింది. రాజకీయంగా, వ్యక్తిగత జీవితంలోనూ ఆటుపోట్లు ఎదుర్కొన్న ఆయన వచ్చే ఎన్నికల్లో కైకలూరు టికెట్ జనసేనకు కేటాయించే అవకాశాలున్నయన్న సందేహంతో పార్టీ వీడినట్లు చెప్తున్నారు.
2009లో జయమంగళ వెంకటరమణ టీడీపీ నుంచి కైకలూరులో పోటీ చేసి గెలిచారు. అయితే, 2014లో బీజేపీతో పొత్తు కారణంగా కైకలూరు సీటును కామినేని శ్రీనివాస్‌కు కేటాయించారు. 2019 నాటికి బీజేపీతో పొత్తు తెగిపోవడంతో కైకలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా జయమంగళ పోటీ చేశారు. అయితే, వైసీసీ గాలిలో ఆయన విజయం సాధించలేకపోయారు. వైసీపీకి చెందిన దూలం నాగేశ్వరరావు గెలిచారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయమనుకుంటున్న తరుణంలో కైకలూరును జనసేనకు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జయమంగళవెంకటరమణ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వైసీపీ ప్రభుత్వం ఆయనకు నలుగురు గన్ మెన్లను కేటాయించింది.
కాగా జయమంగళ వెంకట రమణపై గతంలో ఆయన భార్య గృహహింస కేసు పెట్టారు. ఆయన నుంచి ప్రాణహాని ఉందనీ పోలీసులను ఆశ్రయించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates