‘వారాహి’ రిజిస్ట్రేష‌న్ పూర్తి.. నెంబ‌ర్ ఇదే!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ‌చ్చే 2024 ఎన్నిక‌ల ప్ర‌చారానికి సంబంధించి ఉప‌యోగించాల‌ని నిర్ణ‌యించిన ‘వారాహి’ వాహనానికి లైన్ క్లియర్ అయింది. వారాహి వాహ‌నాన్ని రోడ్డు ర‌వాణా చ‌ట్టం ప్ర‌కారం అన్నినిబంధ‌న‌లు పాటించార‌ని, దీనిని ఆపాల్సిన అవ‌స‌రం లేద‌ని తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో వారాహి వాహ‌నానికి రిజిస్ట్రేష‌న్ పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్‌ నెంబర్ TS 13 EX 8384 కేటాయించారు.

అయితే, ఈ వాహ‌నంపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని వివాదం సృష్టించిన విష‌యం తెలిసిందే. ‘వారాహి’ కలర్‌ ఆలివ్ గ్రీన్ అని.. ఇది సైనికులు వినియోగించే వాహ‌నాల‌కు మాత్ర‌మే వాడ‌తార‌ని, కాబ‌ట్టి ఈ వాహ‌నం రిజిస్ట్రేష‌న్ కాద‌ని.. ప‌వ‌న్ ఇంకా నేర్చుకోవాల‌ని.. ఇలా కామెంట్లు చేశారు.

అయితే, ఈనిపై తెలంగాణ ఆర్టీయే అధికారులు వివరణ ఇచ్చారు. నిబంధనల మేరకు వాహ‌నం ఉన్నందునే రిజిస్ట్రేషన్ చేశామని, ఈ వాహ‌నం రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని, ఆలివ్ గ్రీన్ కాద‌ని అధికారులు వివ‌రించారు.

తాజాగా రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తికావ‌డంతో వారాహి ప్ర‌చార ర‌థం ఇక‌, రోడ్డెక్క‌నుంది. ‘ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం’ అంటూ జనసేన నేత‌లు ప్ర‌క‌టించారు. ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టిన విష‌యం తెలిసిందే. వారాహి అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతున్నాయ‌ని జ‌న‌సేన నాయ‌కులు పేర్కొన్నారు.

రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ పూర్తికావ‌డంతో త్వ‌ర‌లోనే ఈ వాహనానికి తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించి, ఏపీలోకి తీసుకురానున్న‌ట్టు నాయ‌కులు తెలిపారు. మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఈ వాహ‌నాన్ని ఉంచేందుకు ప్ర‌త్యేక షెడ్డును , భ‌ద్ర‌త‌ను కూడా క‌ల్పించారు