పూరి సార్.. మీ రూటే కరెక్ట్

కొన్నేళ్ల ముందు వరకు పూరి జగన్నాథ్ మీద ఉన్న పెద్ద కంప్లైంట్.. ఆయన ఒకే రకం సినిమాలు తీస్తున్నాడని. ‘పోకిరి’ సినిమాతో మాఫియా కథల మాయలో పడిపోయిన ఆయన.. ఆ తర్వాత అదే మత్తులో ఉండిపోయి తన కథలన్నింటినీ మాఫియా చుట్టూనే తిప్పాడని.. వాటి నుంచి బయటికి రాలేక ఇబ్బంది పడుతున్నాడని విమర్శలు వచ్చాయి. గోలీమార్, నేను నా రాక్షసి, బిజినెస్‌మేన్, ఇద్దరమ్మాయిలతో, లోఫర్, పైసా వసూల్.. ఇలా చాలా సినిమాల్లో మాఫియా నేపథ్యం ఉంటుంది.

చాలా వరకు మాఫియా డానే విలన్‌గా ఉంటాడు. ఐతే మొదట్లో కొత్తగా అనిపించిన ఈ నేపథ్యం తర్వాత జనాలకు మొహం మొత్తేసింది. దీంతో పూరి ఇంకెన్నాళ్లు ఈ మాఫియా కథలు తీస్తాడు అనే కామెంట్లు వినిపించాయి. దీంతో ఆయన కూడా అప్పుడప్పుడూ రూటు మార్చే ప్రయత్నం చేశాడు. కానీ అప్పుడు ఇంకా చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

మాఫియా కథలను పూరి పక్కన పెట్టినపుడు రోగ్, మెహబూబా లాంటి భరించలేని సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ‘లైగర్’ విషయానికి వస్తే.. అందులో అస్సలు మాఫియా టచ్ ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే పూరి తన కంఫర్ట్ జోన్‌ నుంచి బయటికి వచ్చి చేసిన సినిమా ఇదని చెప్పొచ్చు. అలా అని ఆయనేమైనా కొత్తగా ట్రై చేశాడా అంటే అదేమీ లేదు. దశాబ్దాలుగా చూస్తున్న రొటీన్ కథనే వండి వార్చాడు.

దీంతో పోలిస్తే ఒకే రకంగా అనిపించినా పూరి ఎప్పుడూ చేసే మాఫియా కథలే ఎంతో బెటర్. కథలు ఒకేలా ఉన్నా.. వేరే రకమైన మలుపులైనా ఉండేవి. వాటిలోనే ఏవో సర్ప్రైజ్ ఎలిమెంట్లు పెట్టేవాడు. కానీ ‘లైగర్’లో చిన్న మెరుపు కూడా ఏదీ కనిపించదు. ఒక్క కొత్త సీన్ కూడా లేదు. దీంతో పూరి మారాల్సిన అవసరం లేదని.. ఆయన ఎప్పుడూ తీసే మాఫియా సినిమాలు చేసినా మేలే అని అభిమానులు ఫీలవుతున్నారు. మరి తర్వాతి చిత్రానికి పూరి ఏ రూట్లో వెళ్తాడో చూడాలి.