పునీత్ ఎంత మంచోడంటే..

26 ఆనాధ ఆశ్రమాలు.. 48 పాఠశాలలు.. 16 వృద్ధాశ్రమాలు.. 19 గోశాలలు.. 1800 మంది పిల్లల దత్తత.. మైసూరలో శక్తి ధామ్ పేరిట ఆడపిల్లలకు శిక్షణ ఇచ్చే సంస్థ‌.. ఇవ‌న్నీ పునీత్ రాజ్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న సేవా కార్య‌క్ర‌మాలకు రుజువులు.

పునీత్ మర‌ణ వార్త తెలిసిన‌ప్ప‌టి నుంచి అత‌డిది ఎంత గొప్ప మ‌న‌సో తెలియ‌జేసే ఈ వివ‌రాల‌తో సోష‌ల్ మీడియా నిండిపోయింది. అత‌డి సేవా కార్య‌క్ర‌మాల‌తో కూడిన వివ‌రాల‌ను అభిమానులు పెద్ద ఎత్తున నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇండియాలో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే సినీ న‌టులు ఎంతోమంది ఉన్నారు.

కానీ ఈ స్థాయిలో ఛారిటీ చేసేవాళ్లు మాత్రం అరుదు. అందులోనూ చాలామంది చేసే సేవ‌ను మించి ప‌బ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు. కానీ పునీత్ అందుకు భిన్నం. పెద్ద‌గా ప్ర‌చార హ‌డావుడి లేకుండా కోట్ల రూపాయ‌ల‌తో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంటాడు. అత‌డి సేవ గురించి బ‌తికి ఉన్న‌ప్ప‌టి కంటే చ‌నిపోయాకే ఎక్కువ వివ‌రాలు వెల్ల‌డ‌వుతున్నాయి.

ఒక్క‌డు ఇంత పెద్ద స్థాయిలో ఛారిటీ చేస్తున్నాడా అని అభిమానుల‌తో స‌హా అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇక క‌న్న‌డ కంఠీర‌వ రాజ్‌కుమార్ త‌న‌యుడిగా త‌న‌మీద ఉన్న బాధ్య‌త‌ను గుర్తుంచుకుని ఎప్పుడూ ఏ వివాదంలోనూ జోక్యం చేసుకోలేదు పునీత్. 20 ఏళ్ల కెరీర్లో అత‌డి గురించి చిన్న కాంట్ర‌వ‌ర్శీ లేదు. ఎవ్వ‌రూ అత‌డి గురించి చిన్న విమ‌ర్శ చేసింది లేదు. చెడుగా మాట్లాడింది లేదు.

పునీత్ రాజ్ కుమార్ కాంట్ర‌వ‌ర్శీ అని గూగుల్లో కొట్టినా.. యూట్యూబ్‌లో వెతికినా ఏ స‌మాచారం దొర‌క‌దు. తండ్రి పేరును నిల‌బెడుతూ ఎంతో బాధ్య‌త‌తో మెలుగుతూ అంద‌రి మెప్పూ పొందాడు. హీరోగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండ‌టం అత‌డి ప్ర‌త్యేక‌త‌. అందుకు సంబంధించిన వీడియోలు ఎన్నో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయిప్పుడు.