ఆ ప‌నులే ట్రంప్ చాప్ట‌ర్ క్లోజ్ చేసేశాయా?

ట్రంప్ ఓట‌మికి గ‌ల కార‌ణాలు ఏంట‌నే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. రాజ‌కీయ విశ్లేష‌కుల అభిప్రాయం ప్ర‌కారం ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణ‌యాలు ఆ దేశాన్ని ఇరకాటంలో ప‌డేశాయ‌ని చెప్తున్నారు. ముందుగా మ‌న దేశం విష‌యానికి వ‌స్తే, హౌడీ-మోదీ, నమస్తే ట్రంప్‌ వంటి సభల్లో ప్రధాని మోదీతో సన్నిహిత మిత్రుడిగా మెదిలిన ట్రంప్‌ మరోవైపు, వీలు చిక్కినప్పుడల్లా భారత్‌ మీద అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నారు. భారత్‌ను ‘టారిఫ్‌ కింగ్‌’గా అభివర్ణిస్తూ, స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై విపరీతమైన సుంకాన్ని విధించారు.

హెచ్‌-1బీ వీసాల జారీపై తాత్కాలికంగా నిషేధాన్ని విధించారు. భారత్‌ అడగకుండానే కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం చేస్తానని తరుచూ చెప్పారు. ఈ ఆఫర్‌ను భారత్‌ తిరస్కరించింది. అయితే చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల విషయంలో భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు. ‘అమెరికా ఫస్ట్‌’ విధానంలో భాగంగా భారత్‌ తదితర దేశాలపై భారీగా సుంకాన్ని విధించారు. మెక్సికో, కెనడా, చైనా (తొలి దశ)తో కీలక వాణిజ్య ఒప్పందాల్ని చేసుకున్నారు.

విదేశీ వలసల విష‌యంలో ట్రంప్ అంత‌ర్జాతీయంగా టార్గెట్ అయ్యారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఏడు దేశాల నుంచి వచ్చే వలసదారులపై ఆంక్షలు విధించారు. మెక్సికో నుంచి వలసలను తగ్గించడానికి సరిహద్దుల్లో గోడను నిర్మిస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా విష‌యంలోనూ ట్రంప్ నిర్ణ‌యం వివాదాస్ప‌దంగా మారింది. వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ, ఆంక్షలు ఎత్తివేయాలని రాష్ర్టాల గవర్నర్లపై ఒత్తిడి తెచ్చారు. ముఖానికి మాస్కు ధరించడాన్ని ఇష్టపడలేదు.

కొవిడ్‌-19 ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థను తెరువాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి ట్రిలియన్‌ డాలర్ల విలువైన ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. 2017లో ట్యాక్స్‌ కట్స్‌ చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రజల ఆరోగ్య అవసరాల కోసం ఒబామా సుదీర్ఘకాలం కృషి చేసి తీసుకొచ్చిన హెల్త్‌ కేర్‌ చట్టాన్ని కూడా ట్రంప్‌ నీరుగార్చారు. అంత‌ర్జాతీయంగా బ‌ల‌ప‌డుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ‘ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్‌షిప్‌’ నుంచి అమెరికాను తొలగించారు.