ఈ వెరైటీ ట్రైలర్ చూశారా?

ఈ వెరైటీ ట్రైలర్ చూశారా?

బాలీవుడ్లో ఈ తరం దర్శకుల్లో లెజెండరీ స్టేటస్ సంపాదించుకున్న డైరెక్టర్ అనురాగ్ కశ్యప్. బ్లాక్ ఫ్రైడే.. దేవ్-డి.. గ్యాంగ్స్ ఆఫ్ వస్సీ పూర్ లాంటి క్లాసిక్‌లతో అనురాగ్ గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాక.. నిర్మాతగా కూడా మారి మంచి అభిరుచి ఉన్న సినిమాలు తీస్తున్నాడు అనురాగ్. ఉదాన్, తలాష్, షాహిద్ లాంటి సినిమాలకు నిర్మాతగా అతడికి గొప్ప పేరు సంపాదించి పెట్టాయి. ఇప్పుడతను ఓ వెరైటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా పేరు.. ‘మన్‌సూన్ షూటౌట్’. ఈ చిత్రానికి సంబంధించి ఓ వెరైటీ ట్రైలర్ వదిలాడు అనురాగ్.

ఇది పోలీస్ డిపార్ట్‌మెంట్లోకి కొత్తగా వచ్చిన ఓ కుర్రాడు.. కరడుగట్టిన ఒక క్రిమినల్ మధ్య సాగే కథ. చాన్నాళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ఆ క్రిమినల్ కేసును ఈ యువ పోలీస్ డీల్ చేస్తాడు. ఓ సందర్భంలో ఆ క్రిమినల్ ఈ పోలీసుకి దొరుకుతాడు. అతడి గన్ పాయింట్లో ఆ క్రిమినల్ ఉంటాడు. అప్పుడతను షూట్ చేయాలా వద్దా అన్న డైలమా తలెత్తుతుంది. ఇక్కడ ట్రైలర్ ఆగుతుంది. ఇక్కడ ఆ రౌడీ నేపథ్యం చూపించి.. అతడికి షూట్ చేయాలా వద్దా అన్నది తేల్చమంటూ ప్రేక్షకులకే నిర్ణయాన్ని వదిలేశారు. దీని గురించి ఒక చర్చ నడిచాక.. మళ్లీ దీనికి కొనసాగింపుగా మరో ట్రైలర్ వదులుతారట. పోలీస్ పాత్రలో విజయ్ వర్మ.. క్రిమినల్ క్యారెక్టర్లో నవాజుద్దీన్ సిద్దిఖి నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్ కుమార్ దర్శకుడు. అనురాగ్ కశ్యప్.. మరో ముగ్గురితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. డిసెంబరు 15న ‘మన్‌సూన్ షూటౌట్’ ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు